
ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బటన్ నొక్కడమే పనిగా వైసీపీ ప్రభుత్వం (ysrcp govt) పనిచేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్లుగా బటన్ నొక్కుతున్నారని సోము వీర్రాజు ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా... రాష్ట్రంలో అభివృద్ధి లేదని, జగన్ (ys jagan) ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.
విజయవాడలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి గత టీడీపీ ప్రభుత్వం భూమిని ఇచ్చిందని.. దానిని వైసీపీ సర్కార్ ఇళ్ల పట్టాల పేరుతో నిరుపయోగంగా మార్చిందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 35 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే.. నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని.. ఈ నెల 21న బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. ఈ సభలో జగన్ సర్కార్ తీరును ఎండగడతామని ఆయన విమర్శించారు.
Also Read:అసమర్ధ ప్రభుత్వం.. వనరులు వున్నా వాడుకోలేదు : జగన్‌పై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
అంతకుముందు ఆగస్ట్ 6న వరుస ట్వీట్లు చేసిన వీర్రాజు... కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మిషన్ పథక ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ది వనరులు వున్నా.. వాటిని ఉపయోగించుకోలేదని అసమర్థ ప్రభుత్వమని వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయుష్ మిషన్ కింద ఏపీకి కావాల్సిన నిధుల కేటాయింపులను కేంద్రం చేసినప్పటికీ.. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణంగా ఈ విభాగంలో అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని వీర్రాజు విమర్శించారు.
గన్నవరంలో 100 పడకలతో ఆయుష్ ఆసుపత్రిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా వున్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం మాత్రం భూమి కేటాయించలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. గతంలో 2015లో కాకినాడలో 100 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదనలు పంపిందని... కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రి నిర్మాణం నిలిచిపోయిందని వీర్రాజు దుయ్యబట్టారు.
అలాగే విశాఖలో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చినప్పటికీ కుటుంబ పార్టీల వైఫల్యం కారణంగా అది కూడా ఏపీకి దక్కలేదని వీర్రాజు అన్నారు. ఆయుష్ కింద ఏపీకి రూ.29 కోట్లను కేంద్రం విడుదల చేసినప్పటికీ.. ఆ తరహా సేవలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.