మా డబ్బును మేం అడుగుతుంటే.. కాకి లెక్కలేంటీ : జగన్‌ సర్కార్‌పై బొప్పరాజు ఆగ్రహం

By Siva KodatiFirst Published Mar 27, 2023, 9:52 PM IST
Highlights

వచ్చే నెల 5న అన్ని ఉద్యోగ సంఘాలతో విజయవాడలో భేటీ కాబోతున్నట్లు తెలిపారు ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. పదవీ విరమణ పొందినవారికి, మరణించిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని.. అందుకే తాము ఉద్యమంలోకి దిగాల్సి వచ్చిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వేతనాలు సకాలంలో చెల్లించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఇతర అలవెన్సులు కూడా చెల్లించాలని వారు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 5న అన్ని ఉద్యోగ సంఘాలతో విజయవాడలో భేటీ కాబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా తమకు రావాల్సిన డబ్బులనే తాము అడుగుతున్నామని.. కానీ సర్కార్ మాత్రం బకాయిలు చెల్లించుకుండా కాకిలెక్కలు చెబుతోందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పదవీ విరమణ పొందినవారికి, మరణించిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని.. అందుకే తాము ఉద్యమంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా రూ.3 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేశామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇది లిఖితపూర్వకంగా తమకు ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పీఆర్‌సీ ఎరియర్స్‌కు సంబంధించి జారీ చేసిన మెమోను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 5న జరిగే సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 

Latest Videos

ALso REad: మినిట్స్ ఇస్తే ఓకే.. లేదంటే ఉద్యమమే, సర్కార్ ట్రాప్‌లో పడం : తేల్చేసిన బొప్పరాజు

ఇదిలావుండగా.. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. నిన్న ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగులు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి తాము ఉద్యోగుల అన్ని పెండింగ్ బిల్లులను క్లెయిమ్ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అయితే ఏపీ జేఏసీ అమరావతి నేతలు మాత్రం పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మార్చి 8న ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అయితే దానిని లిఖితపూర్వకంగా సీఎస్ జవహర్ రెడ్డి ఇవ్వాల్సిందిగా వీరు కోరారు.

click me!