
AP Crime News: భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదంలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. తనపై ఎలాంటి నేరం పడకుడదని భావించిన భార్య.. భర్త శవాన్ని పాకలో పూడ్చిపెట్టింది. కొడుకు కనిపంచకపోవడంతో మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన, శవాన్ని పూడ్చిన మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను చంపి పాకలో పూడ్చిన ఘటన వెగులులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతున్నది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur District) జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు (Guntur District) జిల్లాలోని నగరం మండలం (Nagaram mandal) పరిధిలోని పూడివాడ పంచాయతీ- కాసాని వారి పాలెం కు చెందిన వెంకటేశ్వరావు, ఆది లక్ష్మీలకు పద్దెనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు సజవుగానే వీరి జీవితం ముందుకు సాగింది. వీరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వెంకటేశ్వరావు వ్యవసాయ కూలిగా చేస్తూ మద్యం సేవిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల తొమ్మిదో తేదిన మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్వరావుతో, ఆదిలక్ష్మి గొడవ పడింది. చిన్నగా గొడవ కాస్తా పెద్దదైంది.
తాగిన మైకంలో ఉన్న భర్తకు, భార్యకు మధ్య జరిగిన ఈ ఘర్షణలో తోపులాట చోటుచేసుకున్న క్రమంలో వెంకటేశ్వరరావును ఆదిలక్ష్మి గట్టిగా భర్తను తోసేసింది. దీంతో భర్త గోడకు వెళ్లి బలంగా వెళ్లి తగిలి.. కింద పడిపోయాడు. ఈ సంఘటన నుండి తేరుకున్న ఆదిలక్ష్మి భర్త వద్దకు వెళ్ళి చూసేసరికి అచేతన స్థితిలో ఉన్న భర్త ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించింది. విషయాన్ని కప్పిపుచ్చేందుకు భర్త శవాన్ని మాయం చేయాలనుకుంది. పక్కనే ఉన్న పశువుల పాకలో గుంత తీసి... శవాన్ని పాకలోనే పాతిపెట్టింది. అయితే, రెండు రోజులవరకు గుంతపై గానీ, చనిపోయిన వ్యక్తి గురించి కానీ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది నిందితురాలు. అయితే, మూడో రోజు గొడ్ల పాక నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీనిని స్థానికులు ప్రశ్నించగా, ఏదోఒకటి చెబుతూ కప్పిపుచ్చింది.
ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల నుంచి కొడుకు కనిపించకుండా పోవడంతో మృతుని తండ్రి, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు కనిపించకపోవడంతో కంగారుపడిన మృతుని తండ్రి అచ్చియ్య కోడలును నిలదీశాడు. తన కొడుకు ఎక్కడని నిలదీయడంతో.. తాగివచ్చి కొట్టడంతో గట్టిగా నెట్టాననీ, గోడకు తగిలి తన భర్త చనిపోయాడని ఆదిలక్ష్మి జరిగిన విషయమంతా మామయ్యకు చెప్పింది. ఈ ఘటనపై వెంకటేశ్వరావు తండ్రి అచ్చియ్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
అచ్చియ్య ఫిర్యాదు మేరకు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, రేపల్లె రూరల్ సీఐ శివశంకర్ శనివారం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వరరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య గొడవ జరిగి.. తోపులాటలో చనిపోయాడని భార్య చెబుతున్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విషయం శవాన్ని పూడ్చడం ఒకరి వల్ల అయ్యే పని కాదనీ, ఈ ఘటనలో ఇంకా ప్రమేయం ఉన్నవారు ఉన్నారా? అనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులకు లేఖ రాసిన పోలీసులు వారి సాయంతో శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టమ్ చేసేందుకు సిద్ధమయ్యారు. హత్యకు గల అసలు కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.