నిబంధనల ప్రకారమే తాము కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.
అమరావతి: నిబంధనల ప్రకారమే తాము కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. సోమవారం నాడు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం కొత్తగా ఏ ప్రాజెక్టులను నిర్మించడం లేదన్నారు. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై ఇప్పటికే ఫిర్యాదులు చేశామన్నారు. ఈ విషయమై కేంద్రంతో చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పారు.కల్వకుర్తి, నెట్టెంపహాడ్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులన్నీ కూడ తమ కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకోవడం కోసం నిర్మించడం లేదా అని ఆయన తెలంగాణను ప్రశ్నించారు.
also read:జగన్‌కి కేసీఆర్ కౌంటర్: కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అనుమతుల కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఉన్న కాల్వలను వెడల్పు చేస్తున్నామన్నారు. కానీ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడం లేదని మంత్రి అనిల్ తేల్చి చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ , రాజోలిబండ విషయంలో కూడ తమ ప్రభుత్వం చట్టానికి లోబడే పనిచేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది కూడ గత ప్రభుత్వ హయాంలోనేని ఆయన గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయాలపై అపెక్స్ కౌన్సిల్ లో చర్చస్తామని ఆయన తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో 848 అడుగుల కిందకు లెవల్ పడిపోతే ఏపీకి చుక్కనీరు కూడ తీసుకొనే అవకాశం లేదన్నారు.