ఏపీ జాబ్​ క్యాలెండర్​ పై ర్యాలీలు, ఆందోళనలతో నిరుద్యోగుల నిరసనలు..

By AN TeluguFirst Published Jun 21, 2021, 2:35 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరసన వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. 

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరసన వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. రోడ్లపై మానవహారాలు కట్టి.. పలు చోట్ల కలెక్టరేట్లు ముట్టడించారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అని, తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

ఆర్టీసీని విలీనం చేసి 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. గౌరవవేతనం కింద పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారని నిలదీశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోట క్రాస్ రోడ్స్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు మానవ హారం కట్టారు. తర్వాత కలెక్టరేట్ కు భారీ ర్యాలీ తీశారు. 

జాబ్ క్యాలెండర్ తో ఏమాత్రం లాభం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బాగోలేదంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

click me!