Murali Naik: దేశరక్షణలో వీర మరణం పొందిన జవాను మురళి నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి, 300 గజాల నివాస స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
martyr Murali Naik: జమ్మూ కశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తానుతో జరిగిన కాల్పుల్లో అమరుడైన అగ్నివీర్ ముడావత్ మురళి నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదు ఎకరాల భూమి, 300 గజాల నివాస స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మే 11న అమర జవాను మురళి నాయక్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. ఆయన తన వ్యక్తిగత నిధుల నుండి రూ.25 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మురళి నాయక్ కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తాయి" అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో మురళి నాయక్ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
అలాగే, మరో ఏపీ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోమంత్రి వంనగలపూడి అనిత, ఇతర మంత్రులతో కలిసి మురళి నాయక్ దేహానికి పుష్పాంజలి ఘటించారు. లోకేష్ మాట్లాడుతూ "మురళి నాయక్ ధైర్య సాహసం మన రాష్ట్ర గర్వకారణం. ఆయన త్యాగాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు" అని అన్నారు.
మురళి నాయక్ మృతదేహం మే 10న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడి నుంచి మిలటరీ కాన్వాయ్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండా గ్రామానికి తరలించారు. మార్గమధ్యంలో గ్రామస్తులు జాతీయ పతాకంతో "మురళి నాయక్ అమర్ రహే" నినాదాలతో అశ్రునివాళి అందించారు.
మురళి నాయక్ (23) గోరంట్ల మండలంలోని పేద గిరిజన కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులు ముడావత్ శ్రీరాం నాయక్, జ్యోతి బాయి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. మే 8న రాత్రి పాకిస్థాన్ దళాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, మే 9 తెల్లవారుజామున మృతి చెందాడు. ఇది భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల భాగంగా జరిగింది.
అంత్యక్రియలు పూర్తి రాష్ట్ర గౌరవాలతో నిర్వహించారు. మురళి నాయక్ వీరమరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, "దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళి నాయక్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.