పులిలా గర్జించిన జగన్ పిల్లి అయ్యాడు... ఎందుకో  తెలుసా? : వైఎస్ షర్మిల

By Arun Kumar PFirst Published Mar 2, 2024, 7:28 AM IST
Highlights

తన సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ప్రతిపక్షంలో వుండగా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానన్నవాడు అధికారంలోకి రాగానే చేతులెత్తేసాడని ఆరోపించారు. 

తిరుపతి : అధికారంలోకి రాకముందు పులిలా గర్జించిన జగనన్న ఇప్పుడు పిల్లిలా మారాడని వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. వైసిపి ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచుతానని అన్నోడు ఇప్పుడు మోదీకి వంగివంగి దండాలు పెడుతున్నాడని అన్నారు. కేంద్రంపై పంజా విప్పుదామన్నవాడు బిజెపికి బానిస అయ్యాడంటూ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై షర్మిల విరుచుకుపడ్డారు. 

శుక్రవారం తిరుపతిలోని తారకరామ మైదానంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ  సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైల్ పైనే రాహుల్ గాంధీ సంతకం చేస్తారని షర్మిల తెలిపారు. 10 ఏళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 'ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు' అని షర్మిల నినదించారు. 

డిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా విభజన హామీలను అమలు చేయాల్సిందేనని... కానీ బిజెపి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని షర్మిల తెలిపారు.  విభజన హామీల అమలు ఆంధ్రుల హక్కు అని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం,  కడప స్టీల్, దుగ్గరాజపట్నం పోర్ట్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్ర ప్రజల హక్కులని షర్మిల పేర్కొన్నారు. ఈ హక్కులు మనకు లభిస్తున్నాయో లేదో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. హక్కుల సాధనలో గతంలో చంద్రబాబు నాయడు, ఇప్పుడు జగన్ విఫలం అయ్యారన్నారు. కనీసం ఒక్క హక్కును సాధించడానికైనా పోరాటం చేయలేకపోయారని షర్మిల మండిపడ్డారు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి పదేళ్ళు కావస్తోంది... కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలుకాలేదని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో బాబు, జగన్ మాట మార్చారన్నారు. 15 ఏళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని బాబు అడిగారు... అధికారంలోకి వచ్చాక హోదా అడిగిన వారినే జైల్లో పెట్టారన్నారు. ఇలా రంగులు మార్చిన బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని షర్మిల విమర్శించారు. 

వైసిపికి ఓటెయ్యకండి.. జగనన్నకు గెలిపించకండి..: వైఎస్ సునీత

 ఇక ప్రస్తతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది... మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రజల వున్నారని షర్మిల అన్నారు. అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు 3D గ్రాఫిక్స్ చూపించారు... ఇక మరో ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులన్నాడు... మొత్తంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా రాజధాని లేకపోవడం సిగ్గుచేటని... ఈ పాపం బీజేపీ, చంద్రబాబు, జగన్ లదే అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. 

మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టే అధికారం కోసం చంద్రబాబు, జగన్ ప్రజల్లోకి వస్తున్నారని షర్మిల అన్నారు. రాష్ట్రానికి మోసం చేసిన బీజేపీతో మళ్ళీ పొత్తులకు సిద్ధం అవుతున్నారు... వీళ్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మరోసారి మోదీ దగ్గర తాకట్టు పెట్టేందుకు అటు టిడిపి, ఇటు వైసిపి సిద్దమయ్యాయి... మళ్లీ ఊడిగం చేయడానికి సిద్దమవుతున్నారని అన్నారు. మోడీ ఇద్దరినీ చేతుల్లో పెట్టుకొని ఆట అడిస్తున్నాడు... వీళ్ళు కూడా అధికారం అనుభవిస్తూ హోదాను మరిచారన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని టిపిసిసి చీఫ్ షర్మిల ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి వెళ్లడానికి బాబు, జగన్ ల పాలనే కారణమని షర్మిల ఆరోపించారు. విభజన హామీలు కాదు చివరకు స్థానిక హామీలు కూడా అమలు చేయలేకపోయారని అన్నారు. ఉద్యోగాలు పేరు చెప్పి యువతను మోసం చేశారని అన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో గెలుపు కోసమే హామీలు ఇస్తున్నారని... ఏరు దాటేవరకే ఓడ మల్లన్న - దాటాక బోడి మల్లన్న అనే రకమని ఎద్దేవా చేసారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ బోడి మల్లన్నలేనని షర్మిల మండిపడ్డారు.

click me!