
fan collapsed : ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష రాస్తుండగా సీలింగ్ ఫ్యాన్ పడిపోవడంతో 10వ తరగతి విద్యార్థిని గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తిరిగి పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థిని పరీక్ష రాసేందుకు అనుమతించారు. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 తరగతి బోర్డు ఎగ్జామ్స్ జరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ కిందపడిపోయింది. పదోతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థిపై పైకప్పుపై ఉన్న సీలింగ్ ఫ్యాన్ పడటంతో సదరు విద్యార్థి ముఖంపై గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు పెద్దగా విద్యార్థి గాయపడకపోవడంతో అందరూ ఊపిరిపిల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే సదరు విద్యార్థిని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకుకెళ్లారు. అనంతరం పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించారు. కాగా, ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు జరగడానికి రెండు రోజుల ముందు పాఠశాల మరమ్మతులకు గురైందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని ప్రిన్సిపాల్ అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం కర్నూలులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28న కర్నూలులోని గోనెగండ్లలోని మండల పరిషత్ (అప్పర్ ప్రైమరీ) ఉర్దూ పాఠశాలలో క్లాసులు జరుగుతున్న సమయంలో సీలింగ్‌లోని ఒక భాగం ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.