
హిందూపురం: అధికార వైసిపి నేత దాడిచేసాడని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు కూడా బాధితుడిపైనే దాడికి పాల్పడిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడిని ఎస్సై కొడుతున్న వీడియో బయటకు రావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై దాడి చేసిన చిలమత్తూరు ఎస్సై రంగడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమీషన్ కు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (varla ramaiah) లేఖ రాసారు.
''2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. పోలీసులే బాధితులపైన దాడులు, వేధింపులు, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడి వేణుగోపాల్ పై ఎస్.ఐ దాడి చేయడం కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు నిదర్శనం'' అని వర్ల రామయ్య అన్నారు.
''హిందూపురం అసెంబ్లీలోని సజీవరాయనపాలెంకు చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతున్నారు. ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నాయకులు ఆమె పెన్షన్‌ను తొలగించారు. పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైసిపి నాయకుడు దామోదర్ రెడ్డి దాడి చేయడమే కాకుండా అక్రమ కేసు పెట్టించారు. జరిగిన వాస్తవాలను లిఖితపూర్వకంగా పిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై చిలమత్తూరు ఎస్సై రంగడు అసభ్యంగా దుర్భాషలాడుతూ మరలా దాడి చేశారు. న్యాయం చేయాలని ఆశ్రయించిన బాధితుడిని పోలీసులు మరింత బాధించడం అత్యంత దుర్మార్గం'' అన్నారు.
''చిలమత్తూరు ఎస్సై తీరు రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ఇది ఏపీ పోలీస్ మాన్యువల్‌కు కూడా పూర్తి విరుద్ధం. నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ఎస్సై రంగడు ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. కాబట్టి వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన ఎస్.ఐ రంగడుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని జాతీయ మానవ హక్కుల కమీషన్ ను వర్ల రామయ్య కోరారు.
ఇక చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనపై టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా సీరియస్ అయ్యారు. వైసిపి కార్యకర్తలా వ్యవహరించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడిపై దాడిచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. వైసిపి నాయకున్ని పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చేసాడని... ఇది పోలీస్ శాఖలో పరిస్థితికి అద్దం పడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వాదన మరోలా ఉంది. మద్యం మత్తులో ఉన్న వేణు సంజీవరాయనిపల్లెలో న్యూసెన్స్ చేస్తుండగా కానిస్టేబుల్ అడ్డుపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అడ్డుపడ్డ కానిస్టేబుల్‌పై వేణు తిరగబడ్డాడని.. ఆ విషయంలోనే తాము అతడిని మందలించామని తెలిపారు.
అయితే వేణును ఎస్‌ఐ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఎస్సై వేణును చితక్కొట్టడంతో పాటుగా బూతులు కూడా తిడుతున్నారు. దీంతో ఈ వీడియో చూసినవారు ఎస్సై తీరును తప్పుబడుతున్నారు.