
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 22న భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దావోస్ పర్యటనలో కూదుర్చుకున్న ఎంవోయూలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇళ్ల నిర్మాణ పురోగతి, ఇరిగేషన్ ప్రాజెక్టులు.. తదితర అంశాలు కూడా ఈ బేటీలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్ నేడు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. 2021 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 15.61 లక్షల మంది రైతన్నలకు రూ. 2,977.82 కోట్ల పంట బీమా పరిహారాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.
ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. మనిషికి బీమా ఉన్నట్లే పంటకు బీమా ఉండకపోతే రైతు పరిస్థితి ఏంత దయనీయంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో చూశామని ఆంధరప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో బీమా సొమ్ము జమ అవుతోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారని.. ఈ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.6,685 కోట్ల బీమా చెల్లించిందని చెప్పారు. రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే తీర్చిందన్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.