
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో అతికిరాతకంగా నరికారు దుండగులు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి మాత్రంప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.
గూడురు మండలం పోసివారిపాలెం గ్రామానికి చెందిన పోనిన శాంతమ్మ, రూపావతి కుటుంబానికి గ్రామానికి చెందిన మరికొందరితో ఆస్తి తగాదాలున్నాయి. ఈ తగాదాలను పరిష్కరించుకునేందుకు శాంతమ్మ కుటుంబం కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టులోంచి పిటిషన్ వెనక్కి తీసుకోవాలని గతకొంతకాలంగా ప్రత్యర్థులు బెదిరిస్తున్నారు. అయినప్పటికి మహిళలు న్యాయస్థానంపైనే నమ్మకంతో కేసును వెనక్కి తీసుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన వారు అతి దారుణంగా హత్యచేసారు.
పోసిన మల్లేశ్వరరావు, పోసిన సాంబశివరావు, పోసిన సహదేవుడు, చింతల కొండయ్యతో పాటు మరికొందరు శాంతమ్మ కుటుంబంపై హత్యకు కుట్రపన్నారు. వీరి హత్యకోసం ముందుగానే కత్తులు సమకూర్చుకున్నారు. అదునుకోసం ఎదురుచూస్తున్న దుండగులకు శాంతమ్మ, రూపావతితో పాటు మరో వ్యక్తి ఒకేదగ్గర కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టిన దుండగులు అతి కిరాతకంగా కత్తులతో నరికారు. విచక్షణారహితంగా దాడిచేయడంతో రక్తపుమడుగులో పడిన మహిళలు చనిపోయారని నిర్దారించుకున్నాక అక్కడినుండి పరారయ్యారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన శాంతమ్మ, రూపావతి అక్కడికక్కడే మృతిచెందారు. ఇంకొకరు కొనఊపిరితో వుండటంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు సమాచారం.
పట్టపగలే జరిగిన ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆదారాలను సేకరించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణ హత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళల హత్యలతో పోసివారిపాలెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇలా ఆస్తికోసం ఓ కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించి ఇద్దరు మహిళల్ని పొట్టనబెట్టుకున్నట్లే తెలంగాణలోనూ ఓ దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేయడం లేదని కన్నతండ్రిని గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశాడో కసాయి కొడుకు. ఆదిలాబాద్ పట్టణంలోని పింజరిగుట్ట కాలనీలో ఈ ఘటన కలకలం రేపింది.
పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి విరమణ పొందాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కొడుకు అన్వేష్ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. పనీబాట లేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతూ కుటుంబానికి భారంగా మారిన అతడు తనకు పెళ్లి చేయమని తండ్రితో ప్రతి రోజూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గత సోమవారం వారి మధ్య గొడవ జరిగింది.
ఇక తండ్రి పెళ్లి చేసేలా లేడని భావించిన అన్వేష్ ఆవేశంతో రగిలిపోతూ దారుణానికి ఒడిగట్టాడు. కన్నతండ్రి అన్న ప్రేమ కాదు సాటి మనిషి అన్న జాలికూడా లేకుండా కత్తితో మెడనరికి చంపాడు. కొడుకు దాడిలో గణపతి అక్కడికక్కడే మృతిచెందాడు. కేవలం పెళ్ళికోసం ఉన్మాదిలా మారిన కొడుకు తండ్రిని చంపి మానవ బంధాలకే మచ్చతెచ్చేలా వ్యవహరించాడు. తండ్రిని చంపిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.