
Andhra Pradesh Cabinet: అమరావతిలో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు మూడు గంటలపాటు మీట్ కొనసాగింది. ఈ భేటీలో మొత్తం 33 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో కడప జిల్లా మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కూడా ఉంది. అదానీ సోలార్ ఎనర్జీకి 200.5 ఎకరాల భూమి కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (2025–2030)కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.
51వ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) సమావేశ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కూడా ఆమోదం లభించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఈ భేటీలో ఆమోదించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి చెందిన మున్సిపల్ భూమి లీజు కాలాన్ని 33 ఏళ్ల నుండి 99 ఏళ్లకు పెంచారు.
ప్రభుత్వ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని డిప్యూటేషన్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అదనంగా, 993 కొత్త పోస్టుల మంజూరు కూడా నిర్ణయించారు.
చిత్తూరు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడం, మరో 56 కొత్త పోస్టుల మంజూరుకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల సవరణలు, నాలా చట్టం మార్పులుకు కూడా ఆమోదం తెలిపారు. నాలా పన్ను 4 శాతం వసూళ్లలో 70 శాతం స్థానిక సంస్థలకు, 30 శాతం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదాపై కూడా చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే, మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ బ్రాండ్లకు సంబంధించిన టెండర్ కమిటీ సిఫార్సులను ఆమోదించారు.
కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అంశం ప్రస్తావించారు. అర్హులెవ్వరూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక వసతుల మెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు, ప్రభుత్వ పరిపాలన బలోపేతానికి దోహదపడేలా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.