
YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డిఏలో కొనసాగుతున్నాయి... ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా బిజెపి నేతృత్వంలోని ఈ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ ఆసక్తికర పాలిటిక్స్ కు కారణం అవుతోంది.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఉపరాష్ట్రపతిని నియమించాల్సి వస్తోంది... దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను ప్రారంభించింది. ఎన్డిఏ కూటమి తమ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది... ఎన్నిక లేకుండానే ఆయనను ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకునేందుకు సిద్దమయ్యింది. ఈ బాధ్యతను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీసుకున్నారు.
ఇప్పటికే బిజెపి అధినాయకత్వం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీచేయకుండా నిలువరించే ప్రయత్నం చేస్తోంది... ఇందుకోసం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రాజ్ నాథ్ సింగ్ చర్చించారు. కానీ ఇండియా కూటమి మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది... అభ్యర్థిని ఎంపికచేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఇటు ఎన్డిఏ, అటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్న పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది. ఇలా బిజెపి మద్దతు కోరుతున్న పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఒకటి.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతును కోరుతోంది ఎన్డిఏ. ఇందుకోసం స్వయంగా బిజెపి జాతీయ నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరుపుతోంది… కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మరి వైసిపి అధినేత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ వైరాన్ని మరిచి ఎన్డిఏకు మద్దతిస్తారా? లేదంటే ఇండియా కూటమివైపు వెళతారా? లేదంటే తటస్థంగా వ్యవహరిస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది.
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఎన్డిఏకు మద్దతుగా నిలిచారు. అయితే 2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు ఎన్డీఏలో చేరడంతో ఆయన దూరమయ్యారు. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఓటు కీలకం కానుంది. లోకసభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు వైసిపి సభ్యుల బలం ఉంది... వీళ్ళు ఎవరికి మద్దతుగా నిలుస్తారో చూడాలి.