
Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను తెలియజేసే విలువైన శాసనాలు విదేశాల్లో బైటపడ్డాయి. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఉన్న బవేరియన్ స్టేట్ లైబ్రరీలో భారత పురావస్తు శాఖ (ASI)ఈ శాసనాలను గుర్తించింది. రాజుల కాలంనాటి ఈ శాసనాల ద్వారా ఏపీకి సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు.
జర్మనీలో లభించిన శాసనాలు ఏలూరు-పిఠాపురం ప్రాంతానికి చెందినవిగా తెలుస్తోంది. ఇవి 9 లేదా 10వ శతాబ్దాల నాటి రాగి పలకలపై లిఖించిన శాసనాలు. మూడు రాగి పలకలు సంస్కృత భాషలో, ఆ కాలంలోని తెలుగు అక్షరాలలో లిఖించబడి ఉన్నాయి.
ఈ రాగి పలకలలో తూర్పు చాళుక్య రాజవంశానికి చెందిన ఓ రాజు ఒక గ్రామాన్ని దానం చేసిన విషయాన్ని నమోదు చేశారు. అయితే ఈ పలకలు బాగా పాడయిపోవడంతో పూర్తి సమాచారం చదవలేకపోతున్నాము... కొంతమేర మాత్రమే చదవగలిగామని పురావస్తు శాఖ తెలిపింది. ఇందులో విక్రమాదిత్య, మంగి యువరాజా అనే పేర్లు కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రాగి పలకలు ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు చాళుక్యుల పాలన సాగినట్లు తెలియజేస్తున్నాయి. ఇవి ఆ కాలపు రాజకీయ, భౌగోళిక వ్యవస్థలను తెలిపే విలువైన ఆధారాలు కావచ్చు. ఈ రాగి పలకలు లభించిన బవేరియన్ లైబ్రరీలో భారత్ కు సంబంధించిన మరికొన్ని పురాతన శాసనాలు ఉన్నట్లు ఆర్కియాలజీ అధికారులు తెలిపారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత మూలాల రాగి పలకల సమాచారం సేకరించడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. లైడెన్ రాగి పలకల తిరిగి తరలింపు తరహాలోనే వీటిని కూడా భారతదేశానికి తీసుకురావాలన్నది మా లక్ష్యం" అని పురావస్తు శాఖ (ASI) ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె. మునీరత్నం రెడ్డి తెలిపారు,
ఇలాంటి పురాతన శాసనాల గురించి ఏదయినా సమాచారం ఉంటే తెలియజేయాలని ASI అధికారులు ప్రజలకు సూచించారు. దేశ విదేశాల్లో భారత చరిత్రకు సంబంధించి ఉన్న శాసనాలను గుర్తించి దేశానికి తీసుకురావడం ద్వారా మన చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది. కాబట్టి పురాతన శాసనాలను తిరిగి దేశానికి చేర్చే ప్రయత్నాలు కొనసాగుతాయని భారత ఆర్కియాలజి విభాగం స్పష్టం చేసింది.