అనంత టీడీపీలో ‘విస్తరణ’ చిచ్చు..!

First Published Sep 25, 2017, 4:02 PM IST
Highlights
  • మూడున్నర సంవత్సరాలుగా టీడీపీలో నానుతున్న  అనంతపురం రోడ్ల విస్తరణ వివాదం
  • తారా స్థాయికి చేరుకున్న వివాదం
  • ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారిన చంద్రబాబు పరిస్థితి

కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం.. అన్నట్టుంది చంద్రబాబు నాయుడు పరిస్థితి.   మూడున్నర సంవత్సరాలుగా టీడీపీలో నానుతున్న  అనంతపురం రోడ్ల విస్తరణ వివాదం తారా స్థాయికి చేరుకుంది. అనంతపురం రోడ్ల విస్తరణ చేపట్టాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ప్రయత్నించినా.. దానిని మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుకుంటూ వస్తున్నారు. తాజాగా జేసీ రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించగా.. చంద్రబాబు కాస్త తొలగ్గారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మళ్లీ రంగంలోకి దిగి.. చంద్రబాబుకి తలనొప్పిగా మారారు. దీంతో ఇద్దరిలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక అవస్థలు పడుతున్నాడు చంద్రబాబు.

అసలు ఏం జరిగిందంటే.. జేసీ దివాకర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నేత. అనంతపురం ఎంపీగా ఉన్న ఆయనకు.. అక్కడి ప్రధాన సామాజిక వర్గమైన కమ్మవారితో మొదటి నుంచి సఖ్యత లేదు. ఆయనకు కేవలం బీసీ,  ఎస్సీ, రెడ్డిలు మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఆ ఎన్నికల కోసం ప్రజలను ఓట్లు అడగక తప్పదు.. ఆ సమయంలో ‘ఎంపీగా ఉన్న ఇన్ని సంవత్సరాలు మాకేం చేశారు’ అనే ప్రశ్న ప్రజల నుంచి తప్పక వస్తుంది.   అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో తన బదులు  తన కుమారుడు  పవన్ రెడ్డిని ఎన్నికల్లో దింపాలని జేసీ యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమై.. అతనిని ఎన్నికల్లో దింపితే..జేసీ మీద ఉన్న వ్యతిరేకత ఆయన కుమారుడిపై పడే అవకాశం ఉంది. దీంతో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ చంద్రబాబును  బెదిరించడం మొదలుపెట్టాడు.

తాను ప్రజలకు ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఏమీ చేయలేకపోయానని.. కనీసం అనంతరపురం రోడ్ల విస్తరణ చేపట్టలేకపోయానని, చాగల్లు నుంచి తాడిపత్రికి నీటిని విడుదల చేయలేకపోయానని మీడియా ముఖంగా చెప్పాడు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో కలకలం రేగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఆయన పెట్టిన షరతులకు ఒప్పుకున్నాడు. వెంటనే తాడిపత్రికి నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణ కూడా చెప్పట్టడానికి అవకాశం ఇచ్చారు.  అలా హామీ ఇచ్చారో లేదో.. చంద్రబాబుకి మరో తలనొప్పి మొదలైంది. అనంతపురంలో కమ్మ సామాజికవర్గంలోని వ్యాపారస్థుల పై ఉన్న కోపంతోనే రోడ్ల విస్తరణ చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యేకి మద్దతుగా మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు కూడా జతకలిశారు. వీరంతా.. జేసీకి ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరిని కాదని జేసీకి మద్దతు ఇస్తే.. ఇటు మంత్రులను, వారి మద్దతు దారులను , కమ్మ ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది. అలా కాదని..వీరికి మద్దతు ఇస్తే.. జేసీకి మద్దతుగా నిలిచిన రెడ్డి, బీసీ కులస్థుల ఓట్లు కోల్పోయే అవాకశం ఉంది. దీంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది చంద్రబాబు పరిస్థితి.

click me!