ఒంటరి పోటీకే కార్యకర్తల మొగ్గు

First Published May 26, 2017, 5:32 PM IST
Highlights

విషయాలన్నింటినీ నిశితంగా గమనించిన అమిత్ షా టిడిపితో పొత్తు విషయంలో క్షేత్రస్ధాయిలోని కార్యకర్తల మనోభావాలను కూడా అంచనా వేసినట్లే ఉన్నారు. అందుకే ఆ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రస్తావించారు. టిడిపితో పొత్తు విషయంలో కార్యకర్తలల మనోభావాలను ఏకంగా మీడియా సమావేశంలోనే అమిత్ షా ప్రస్తావించటమంటే ఏదో తేడా కొడుతోందనే అనుకోవాలేమో.

‘ఏపిలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయాలన్నది కార్యకర్తల సూచన’ అంటూ తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్య. నరేంద్రమోడి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుని మూడేళ్ళయిన సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియితో మాట్లాడారు. నాలుగు రోజుల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన అమిత్ షా ఏపిలో టిడిపి-భాజపా పొత్తుపై ఢిల్లీలో మాట్లాడటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

రాష్ట్ర భాజపాలో రెండు వర్గాలున్నాయి. ఒకటేమో చంద్రబాబుకు అనుకూల వర్గం. అంటే వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదిరులు. రెండో వర్గమేమో సోమువీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు వద్దంటూ రాష్ట్రంలోని పలువురు నేతలు జాతీయ నాయకత్వానికి ఎప్పటి నుండో చెబుతున్నారు. మూడేళ్ళ చంద్రబాబు పాలనలో ప్రజావ్యతిరేకత పెరిగిపోయిందని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటమే పార్టీకి మేలు చేస్తుందంటూ చెబుతున్నారు. అమిత్ పర్యటనలో కూడా మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు. అయితే, ఇంత వరకూ అమిత్ షా నేతల మాటలను మాత్రమే విన్నారు. కానీ గురువారం సాయంత్రం జరిగిన సమ్మేళనంలో కార్యకర్తల మనోభావాలను కూడా గ్రహించినట్లే ఉన్నారు.

ఎలాగంటే, వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు వెంకయ్యకు, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ‘లీవ్ టిడిపి- సేవ్ బిజెపి’ అంటూ నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. అంతేకాకుండా వెంకయ్యకు వ్యతిరేకంగా పెద్ద నినాదాలు కూడా చేయటం అమిత్ షా గమనించారు. నినాదాలు చేస్తున్న వారిని కూర్చోవాల్సిందిగా వెంకయ్య ఎంత చెప్పినా వినకపోగా మరింత రెచ్చిపోయారు.

ఈ విషయాలన్నింటినీ నిశితంగా గమనించిన అమిత్ షా టిడపితో పొత్తు విషయంలో క్షేత్రస్ధాయిలోని కార్యకర్తల మనోభావాలను కూడా అంచనా వేసినట్లే ఉన్నారు. అందుకే ఆ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రస్తావించారు. టిడిపితో పొత్తు విషయంలో కార్యకర్తలల మనోభావాలను ఏకంగా మీడియా సమావేశంలోనే అమిత్ షా ప్రస్తావించటమంటే ఏదో తేడా కొడుతోందనే అనుకోవాలేమో.

click me!