చంద్రబాబు మెడకు అమరావతి భూములు: ఏపీ సిఐడి నోటీసులు జారీ

By telugu teamFirst Published Mar 16, 2021, 9:16 AM IST
Highlights

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబుకు ఏపీ సిఐడి అధికారులు అమరావతి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో రూపంలో కూడా షాక్ తగిలింది. హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి ఆంధ్రప్రదేశ్ సీఐడి అధికారులు వచ్చారు. రెండు బృందాలుగా సీఐడి అధికారులు హైదరాబాదు చేరుకున్నారు. ఒక బృందం చంద్రబాబు నివాసానికి వచ్చింది.

అమరావతి భూముల వ్యవహారంలో సీఐడి అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి భూముల వ్యవహారంలో ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని వారు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి భూముల వ్యవహారంలో సీఐడి అధికారులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా ఓ కేసు నమోదైంది. 

కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడి అధికారులు అమరావతి భూముల వ్యవహారంపై కేసులు నమోదు చేశారు. చంద్రబాబు బంధువులు అతి తక్కువ ధరకు దాదాపు 500 ఎకరాల భూములను చంద్రబాబు బంధువులకు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ.

మాజీ మంత్రి నారాయణకు కూడా సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. నారాయణ అమరావతికి భూములు సేకరించే విషంయలో కీలక పాత్ర పోషించారు. నారాయణ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నారాయణ ఇటీవలి కాలంలో టీడీపీ వ్యవహారాల్లో కూడా పాల్గొనడం లేదు.

కోర్టు కేసుల కారణంగా సిఐడి విచారణ మందగిస్తూ వచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఓ తాహిసిల్దార్ ను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఓ సంఘటనలో మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ సిఐడి విచారణ ఇక ఆగిపోయినట్లేనని భావించారు. కానీ, అకస్మాత్తుగా చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంతో విచారణ ముమ్మరవుతోందని భావిస్తున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందు వల్లనే చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

చంద్రబాబుకు సిఐడి ఇచ్చిన నోటీసు ఇదే... pic.twitter.com/4YsI37Lhzb

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

చంద్రబాబుకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షనన్ల కింద కేసులు నమోదు చేశారు. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ సీఆర్డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు చేసింది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంపై  సీఐడీ కేసులు పెట్టింది. దళితులకు కేటాయించిన భూములు రాజధాని ప్రకటనకు ముందు ఇతరుల కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి

భూ సమీకరణ ప్రకటించిన తర్వాత వాటిని కాబినెట్ అనుమతి లేకుండానే బదలాయింపు కి చంద్రబాబు ప్రభుత్వం అనుమతించినట్లు ఆరోపణలు ఉన్నాయి దాదాపు 500ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్ళను వన్ టైమ్ సెటిల్మెంట్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతించారు. అధికారుల అభ్యంతరాలు, సూచనలు పట్టించుకోకుండా చైర్మన్ హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అమరావతి భూముల వ్యవహారంపై సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఐటి శాఖకు లేఖ రాశారు. 106 మంది వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన ఆ లేఖలో కోరారు. రూ.2 లక్షలకు మించిన లావాదేవీలపై విచారణ జరపాలని ఆయన కోరారు.

click me!