ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్: డీజీపీ గౌతం సవాంగ్

By narsimha lodeFirst Published Sep 13, 2020, 12:24 PM IST
Highlights

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్ చేయాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఎస్పీలను ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత చర్యలను డీజీపీ  సమీక్షించారు.


అమరావతి: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్ చేయాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఎస్పీలను ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత చర్యలను డీజీపీ  సమీక్షించారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల ఎస్పీలతో సవాంగ్ ఆదివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయ రథం దగ్ధం కావడం రాష్ట్రంలో రాజకీయ రచ్చకు కారణమైంది.దీంతో ఈ విషయమై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఆలయాలను జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెట్టాలన్నారు. ఆలయాల పాలకవర్గాలు పోలీసుల సూచనలుపాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.

మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల కూడ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి దేవాలయం వద్ద దగ్గర పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయ పరిసరాల్లో అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాలని ఆయన సూచించారు.

అనుకోని ఘటనలు జరిగితే వాటికి సంబంధించిన నిర్వాహకులు బాధ్యత వహించాలని డీజీపీ చెప్పారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకొనేలా శాంతి కమిటీలు వేయాలని ఆయన కోరారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా ఎస్పీలు నిర్ణయాలు తీసుకోవాలని డీజీపీ కోరారు. 

మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా... అందుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డీజీపీ ఆదేశించారు.
 

click me!