నిరుద్యోగులకు శుభవార్త

First Published Jan 13, 2018, 1:47 PM IST
Highlights
  • ఇ-కామ‌ర్స్ ద్వారా అంధ్ర‌ప్ర‌దేశ్ లో వేలాది మంది నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అందించేందుకు ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది.

ఇ-కామ‌ర్స్ ద్వారా అంధ్ర‌ప్ర‌దేశ్ లో వేలాది మంది నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అందించేందుకు ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. చైనాకు చెందిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అలీబాబా డాట్ కామ్ కంపెనీ స‌హ‌కారంతో ఏపీలో నిరుద్యోగుల‌కు శిక్ష‌ణ,  ఉపాధి క‌ల్పించేందుకు త్వ‌ర‌లో ఒప్పందం జరగబోతోంది.  

అలీబాబా కంపెనీ ప్ర‌తినిధుల‌తో  పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ శ‌నివారం ఉద‌యం హైద‌రాబాదులో చ‌ర్చ‌లు జ‌రిపారు. మ‌రో వారం ప‌ది రోజుల్లో విజ‌య‌వాడ‌లో అలీబాబా కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఎం.ఓ.యు. చేసుకోనున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ‌లో ఉపాధి శిక్ష‌ణ కోసం మంత్రి తొలుత అలీబాబా కంపెనీ చైనా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

అయితే, ఇది కేవ‌లం త‌మ శాఖ‌కే ప‌రిమితం కాకుండా ఏపీలోని నిరుద్యోగ యువ‌త మొత్తానికి వ‌ర్తింప చేయాల‌ని అనుకున్నారు. అందులో భాగంగానే చైనా ప్ర‌తినిధుల‌ను మంత్రి నారా లోకేష్ దగ్గరకు తీసుకెళ్ళారు. అలీబాబా కంపెనీ ఇండియా బిజినెస్ డెవ‌ల‌ప్మెంట్ హెడ్ వండ‌ర్ ఛాన్,  టి.డి.ఐ. గ్లోబ‌ల్ హెడ్ సంజ‌య్ శ‌ర్మ‌ల‌తో చ‌ర్చించిన లోకేష్ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్ప‌న‌కు ఇది మంచి అవకాశంగా అభిప్రాయపడ్డారు.

ఈ కంపెనీ ద్వారా ఏపీలో వేలాది మంది నిరుద్యోగుల‌కు టెక్నిక‌ల్, ఇ-కామ‌ర్స్, మార్కెటింగ్ లో శిక్ష‌ణ అందించి ఉపాధి కల్పిస్తామ‌ని వండ‌ర్ ఛాన్ తెలిపారు. త్వ‌రలో న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో అలీబాబా కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఎం.ఓ.యు. కుదుర్చుకోనున్నట్లు అఖిల చెప్పారు.

click me!