భాజపా టార్గెట్ 10 సీట్లు

First Published May 8, 2017, 9:49 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో గ్రేటర్లోని 24 సీట్లలో కనీసం 10 చోట్ల భాజపా జెండాను ఎగరేయాలన్నది అమిత్ లక్ష్యంగా కనబడుతోంది. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లోని 10 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. భాజపా ‘ఆపరేషన్ 7 స్టేట్స్’ లో భాగంగా తెలంగాణాలో పార్టీ బలోపేతంపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో గ్రేటర్లోని 24 సీట్లలో కనీసం 10 చోట్ల భాజపా జెండాను ఎగరేయాలన్నది అమిత్ లక్ష్యంగా కనబడుతోంది. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్నారు.

ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలను నమ్మకుంటే తన లక్ష్యాన్ని అందుకోవటం సాధ్యం కాదన్న విషయాన్ని అమిత్ షా తొందరగానే గ్రహించారు. అందుకనే ఇతర పార్టీల్లోని నేతలపైన కూడా కన్నేసారు. వారి అవసరాలేమిటి? తాము తీర్చగలిగినదేమిటి? అనే విషయాలపై షా కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని నేతలు తమ పార్టీలోకి రావాలంటే వారు కోర్కెలను తీర్చగలిగితేనే వారు వస్తారన్న విషయాన్ని తెలియని వారేం కాదు కదా అమిత్ షా.

అందుకనే ఇతర పార్టీల నేతలకు వేస్తున్న గాలాన్ని జాగ్రత్తగా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నందీశ్వర్ గౌడ్ కమలం పార్టీలో చేరిపోయారు. ఈనెల 20 నుండి మూడు రోజుల పాటు అమిత్ షా హైదరాబాద్ లోనే మకాం వేస్తున్నారు. అప్పటికి మరికొందరిని పార్టీలోకి చేరేలా ఒప్పించాలని అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ లో కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో భాజపా నేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానం టిఆర్ఎస్ లో చేరుతానే ప్రచారం జరిగిన వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే, ఈసారి భాజపాలో చేరటం మాత్రం ఖాయమని భాజపా వర్గాలు చెబుతున్నాయి. చూడాలి అమిత్ షా పర్యటనలో ఏం జరుగుతుందో?

 

click me!