రెండూ కలిసి రాష్ట్ర పరువు తీసేస్తున్నాయ్

Published : May 08, 2017, 07:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
రెండూ కలిసి రాష్ట్ర పరువు తీసేస్తున్నాయ్

సారాంశం

నిజంగానే వైసీపీ గనుక చంద్రబాబు పర్యటనపై ఫిర్యాదు చేసి ఉంటే సదరు ఫిర్యాదు కాపీని టిడిపి బయటపెట్టి ఉండాలి. లేదా వైసీపీ ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని పోలీసులైనా స్పష్టం చేయాలి. ఇంతవరకూ రెండు జరగలేదు.

మొత్తానికి పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ కలిసి అమెరికాలో రాష్ట్రం పరువు తీసేస్తున్నాయి. చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా వివాదం తలెత్తటం గమనార్హం. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అనుమతి లేకుండా విరాళాలు సేకరిస్తున్నారంటూ వైసీపీ డల్లాస్ లోని ఇర్వింగ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసారన్నది టిడిపి ఆరోపణ. వైసీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబు కార్యక్రమాల నిర్వాహకులతో మాట్లాడారని టిడిపి నేతలంటున్నారు.

ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స పేరిట ఫిర్యాదు చేసినట్లు టిడిపి అనుకూల మీడియా చెబుతోంది. అందులో కూడా ఎక్కడా వైసీపీ ప్రస్తావన లేదు. అయినా వైసీపీకి చెందిన వారే ఫిర్యాదు చేసారని టిడిపి చెప్పేస్తోంది. ఫిర్యాదు చేసిన వారే ఎక్కడ దాడులు చేస్తారో అన్న అనుమానంతో పోలీసులు చంద్రబాబుకు భారీ భద్రత కల్పించినట్లు టిడిపి నేతలంటున్నారు.

టిడిపి చేస్తున్న ఆరోపణలను సహజంగానే వైసీపీ ఖండిస్తుంది కదా? అమెరికాలోని ఎన్ఆర్ఐ విభాగాన్ని చూస్తున్న రత్నాకర్ కూడా చంద్రబాబు పర్యటనకు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు. తాము కానీ తమకు సంబంధించిన వారు కానీ ఎవరూ ఫిర్యాదు చేయాలేదని స్పష్టం చేసారు. ఇంతకీ చంద్రబాబు పర్యటనపై వైసీపీ ఆరోపణలు చేసింది నిజమేనా? లేక చంద్రబాబు పర్యటనలో ఆశించిన ఫలితాలు కనబడకపోవటంతో టిడిపినే ముందుజాగ్రత్తగా వైసీపీపై బురదచల్లుతూ ఎదరుదాడులు మొదలుపెట్టింది? అన్న అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి.

ఇన్ని అనుమానాలకు కారణాలేమిటంటే? నిజంగానే వైసీపీ గనుక చంద్రబాబు పర్యటనపై ఫిర్యాదు చేసి ఉంటే సదరు ఫిర్యాదు కాపీని టిడిపి బయటపెట్టి ఉండాలి. లేదా వైసీపీ ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని పోలీసులైనా స్పష్టం చేయాలి. ఇంతవరకూ రెండు జరగలేదు. మరి టిడిపి చేస్తున్న ఆరోపణలు నిజమని ఏంటి నమ్మకం?

సిఎం హోదాలో గతంలో కూడా ఎన్నోమార్లు చంద్రబాబు అమెరికాకు వెళ్లారు, వచ్చారు. ఇపుడూ అంతే. ఈమాత్రానికే వైసీపీ ఫిర్యాదు చేస్తుందా? ఒకవేళ ఫిర్యాదు చేస్తే వైసీపీకి వచ్చే లాభమేమిటి? రాష్ట్రంలో చంద్రబాబు పాలనపైన, విదేశీ పర్యటనలపైన వైసీపీ ఎప్పటికప్పుడు స్పందిస్తోంది కదా? ప్రస్తుత చంద్రబాబు అమెరికా పర్యటనపై ఫిర్యాదు చేసి వైసీపీ సాధించేది ఏముంటుంది.  ఒకవేళ వైసీపీ నిజంగానే ఫిర్యాదు చేసిఉంటే మాత్రం అది తప్పే. ఎందుకంటే, ఎంతోమంది ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్ళి వచ్చారు. వారి పర్యటనలపై అభ్యంతరాలు చెబుతూ ఆయా దేశాల్లో ఏ తెలుగువారూ ఫిర్యాదు చేసిన దాఖల్లాల్లేవు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu