కృష్ణపట్నం పోర్టు: జగన్ కు ఆదానీ గ్రూప్ షాక్

By narsimha lodeFirst Published Aug 20, 2019, 11:45 AM IST
Highlights

కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను దక్కించుకొనేందుకు అదానీ గ్రూప్ సానుకూలంగా ఉంది. చర్చలు తుది దశలో ఉన్నాయి. అదే జరిగితే రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని జగన్  కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చంటున్నారు.

నెల్లూరు:ఏపీ సీఎం వైఎస్ జగన్ ‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కృష్ణపట్నం పోర్టులో 70 శాతం వాటాను అదానీ గ్రూప్‌ దక్కించుకొనే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై చర్చలు తుదిదశలో ఉన్నట్టుగా అదానీ గ్రూప్ ప్రకటించింది.

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత  ప్రధాని మోడీని కలిశారు. ఏపీ పునర్విభజన బిల్లులో హామీ ఇచ్చినట్టుగా రామాయపట్నం పోర్టును నిర్మించాలని జగన్ ప్రధానిని కోరారు. దీంతో  నవయుగ వెంటనే అదానీ గ్రూప్ తో తమ ఒప్పందం విషయమై చర్చలను వేగవంతం చేసింది.

కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోనే రామాయపట్నం పోర్టు ఉంటుంది.రామాయపట్నం పోర్టు ప్రారంభమైతే కృష్ణపట్నం పోర్టుపై ప్రభావం ఉంటుంది. ఈ పోర్టుకు వచ్చే రెవిన్యూను రామాయపట్నం పోర్టు దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.  కృష్ణపట్నం పోర్టును అదానీ గ్రూప్ తమ చేతుల్లోకి తీసుకొంటే రామాయపట్నం పోర్టును నిర్మించాలని కేంద్రంపై వైఎస్ జగన్  ఒత్తిడి తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


కృష్ణపట్నం పోర్టుకు పోటీ అవుతుందనే ఉద్దేశ్యంతో నవయుగ గ్రూప్ తన రాజకీయ పలుకుబడితో  దుగ్గరాజపట్నం లేదా రామాయపట్నం వద్ద పోర్టులను అడ్డుకొందనే విమర్శలు లేకపోలేదు.అదానీ గ్రూప్ కేంద్రానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానికి ఈ గ్రూప్ అత్యంత సన్నిహితంగా ఉంటుందనే ప్రచారం ఉంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలని కేంద్రాన్ని కోరారు.అయితే ఆ తర్వాత రామాయపట్నం నుండి  దుగ్గరాజపట్టణానికి పోర్టు నిర్మించే స్థలం మారింది.ఈ ప్రతిపాదనను పక్కన  పెట్టేందుకే స్థలాన్ని మార్చారనే విమర్శలు కూడ లేకపోలేదు.

శ్రీహారికోట, పులికాట్ సరస్సుకు అతి సమీపంలోనే దుగ్గరాజపట్నం ఉన్నందున రామాయపట్టణానికి పోర్టు స్థలాన్ని మార్చాలని ఆనాడు అధికారులు సూచించడంతో కిరణ్ కుమార్ రెడ్డి రామాయపట్టణం వద్ద పోర్టు నిర్మాణానికి ఓకే చెప్పినట్టుగా చెబుతారు.

2014లో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఈ సమయంలో కృష్ణపట్నం పోర్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఏనాడూ వ్యవహరించలేదు. 

2008 లో ఏర్పాటైన కృష్ణపట్నం పోర్టు కాకినాడ పోర్టు కంటే మూడింతలు పెద్దది. కాకినాడ పోర్టు 18 మిలియన్ టన్నులను గత ఏడాది ఎగుమతులు, దిగుమతులు సాగాయి.కానీ కృష్ణపట్నం పోర్టు గత ఏడాది 54.4 మిలియన్ టన్నులు ఎగుమతులు, దిగుమతులు సాగాయి. చెన్నైలో కేవలం 53 మిలియన్ టన్నులు మాత్రమే సాగినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

2015-16 లో కృష్ణపట్నం 1.18 లక్షల  2016-17 లో 2.55 లక్షలు, 2017-18లో, 2018-19లో 5.01 లక్షల కంటైనర్లను ఉపయోగించింది.అదానీ గ్రూప్ కు చెందిన స్పెషల్ ఎకనామిక్ జోన్ కృష్ణపట్నం పోర్టును కొనుగోలు చేసే విషయాన్ని చర్చిస్తున్నట్టుగా సమాచారం. అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్టును కొనుగోలు చేసినా కూడ ప్రస్తుతం ఉన్న మేనేజ్ మెంట్ పోర్టును నిర్వహించనుందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి.


 

click me!