తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు..

Published : Jan 28, 2023, 02:47 PM ISTUpdated : Jan 28, 2023, 03:22 PM IST
తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు..

సారాంశం

ప్రముఖ సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడింది. 

ప్రముఖ సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆస్పత్రి వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలిపారు. జనవరి 27న కుప్పంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారని.. అక్కడి ఆస్పత్రులలో  చికిత్స అందించారని చెప్పారు. అతని పరిస్థితిని అంచనా వేసేందుకు నారాయణ హృదయాలయ నుంచి నిపుణుల బృందం కుప్పంకు వెళ్లిందని పేర్కొన్నారు. ఆ సమయంలో అతడిని తమ ఆస్పత్రికి బదిలీ చేయమని అడగడం జరిగిందని చెప్పారు. జనవరి 28న తెల్లవారుజామున 1 గంటకు తారకరత్నను తమ ఆస్పత్రికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. 

కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు, ఇతర నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు. తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్తిమ శ్వాస కొనసాగుతున్నట్టుగా తెలిపారు. ఇక, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బెంగళూరులోనే  ఉన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడు కూడా ఈరోజు సాయంత్రం బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది.

 


అసలేం జరిగిందంటే.. 
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు. లోకేష్ వెంట బాలకృష్ణ, తారకరత్నలు కూడా ఉన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని దేవాలయాలు, మసీదు, చర్చిలను లోకేష్ సందర్శించారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు రాగానే ఒక్కసారిగా తారకరత్నకు కళ్లు తిరిగి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అక్కడి వారు తారకరత్నను వాహనాల్లో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సమీపంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నటుడికి సీపీఆర్‌, యాంజియోగ్రామ్‌ చేశారు. 

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకుని అక్కడే ఉండిపోయారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తారకరత్న ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఇక, చంద్రబాబు ఆస్పత్రి వైద్యులు, బాలకృష్ణ, టీడీపీ నాయకులతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. 

మరోవైపు మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి చెందిన కొందరు వైద్యులు కూడా కుప్పం చేరుకున్నారు. ఇక, శుక్రవారం రాత్రి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పీఈఎస్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకనున్నారు. అనంతరం శుక్రవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తరలించారు. బాలకృష్ణ కూడా బెంగళూరు వెళ్లారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu