టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్.. మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : May 06, 2022, 02:52 PM IST
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్.. మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ, ఉద్రిక్తత

సారాంశం

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనపై ఏబీవీపీ ఫైరైంది. దీనిని నిరసిస్తూ శుక్రవారం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. 

ఇటీవల పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్ర‌య‌త్నించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్ర‌యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

దీంతో పోలీసులు, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య‌ తోపులాట జరిగింది. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు జీవితాలతో ఏపీ ప్రభుత్వం ఆటలు ఆడుతోందంటూ ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు మండిపడ్డారు. ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ప‌ద‌వికి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇకపోతే.. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై (10th class exams in andhra pradesh) ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడా పేపర్ లీక్ కాలేదని, మాస్ కాపీయింగ్ (paper leak case) జరగలేదని ఆయన స్పష్టం చేశారు. 60 మందిపై కేసు నమోదు చేయగా, 38 మంది ప్రభుత్వం, 22 మంది ప్రైవేటు సంస్థల సిబ్బంది, మాజీ విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రిమినల్ కేసు పెట్టామని.. సెల్‌ఫోన్, వాట్సాప్ ద్వారా ఆన్సర్ చేసేందుకు ప్రయత్నం చేశారని మంత్రి చెప్పారు. ఉయ్యూరులో ఐదుగురు టీచర్‌లను పేపర్ రెడీ చేస్తుండగా పట్టుకున్నామని బొత్స వెల్లడించారు. 

రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నాయని.. తాము తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు సైలెంట్‌గా ఉంటాయా అని సత్యనారాయణ ప్రశ్నించారు. వాళ్లు కూడా విషయం తెలుసుకుని బాధ పడుతున్నారని చెప్పారు. టెక్నాలజీని మంచి కోసం వాడాలే కాని.. ఇలా విద్యార్థుల జీవితంతో ఆడుకోవద్దని బొత్స హితవు పలికారు. బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని అంటుంటే నవ్వొస్తుందన్నారు. ఎవరు తప్పు చేసినా.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. 

ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది ప్రమేయంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. ఎవరిని ఉద్దరించడానికి లోకేష్ (nara lokesh), అచ్చెంనాయుడులు (atchannaidu) లేఖలు రాశారోనంటూ దుయ్యబట్టారు. లోకేష్ రాజకీయం కోసమే మాట్లాడుతున్నాడని.. 60 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు వారికి పట్టదా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలతో పట్టుకున్నాక... కక్ష సాధింపు అనడం ఏమిటని మంత్రి నిలదీశారు. స్కూల్స్ ప్రమేయం ఉంటే వాటి అనుమతి రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెడతామని బొత్స హెచ్చరించారు. 

ఈ నెల 6 నుండి 24 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పది లక్షల మంది హాజరవుతున్నారని మంత్రి చెప్పారు. ఇంటర్ పరీక్షలకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని బొత్స తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించి, అవసరమైతే సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. పరీక్షలను రాజకీయం చేయొవద్దని.. మరో వేదిక పై చూసుకుందామని సత్యనారాయణ హితవు పలికారు. కొన్ని ప్రాంతాలలో జరిగిన చిన్న సంఘటనలను రాజకీయ వివాదం చేశారని ప్రతిపక్షాలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Minister Nara lokesh: అంగన్వాడీ ఆయా కొడుకు మాటలకు లోకేష్ ఫిదా | Asianet News Telugu
Minister Nara Lokesh: ఈ బాలుడి కష్టాలు వినిఎమోషనల్ అయిన లోకేష్ | Asianet News Telugu