ఏపీ రాష్ట్రంలో పొత్తులపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు కలవాల్సిన అవసరం ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై TDP చీఫ్ Chandrababu Naidu శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఓ మెట్టు దిగుతానన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్ధించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారానికి తెర తీసింది. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
గతంలో కుప్పంలో చంద్రబాబు టూర్ సమయంలో కూడా జనసేనతో పొత్తుపై ఓ కార్యకర్త ప్రశ్నించారు. అయితే వన్ సైడ్ లవ్ సరైంది కాదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు.
బీజేపీతో జనసేన మధ్య పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల కాలంలో అగాధం పెరిగిందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ నాయకత్వం ఖండిస్తుంది. జనసేన నేతలు కూడా తమ మధ్య దూరం పెరగలేదని చెబుతున్నారు. అయితే ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.
2014 లో టీడీపీ, బీజేపీ ల కూటమికి జనసే మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ లు ప్రభుత్వంలో చేరాయి. 2019 నాటికి రాస్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి 2019 ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ పార్టీలతో పోటీ చేసింది. టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకూడదంటే విపక్ష ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు. విపక్షాలు ఐక్యంగా పోటీ చేస్తే జగన్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో ఏర్పాటు కాకుండా చూడొచ్చని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. తాము త్యాగాలకు కూడా సిద్దమని ప్రకటించారు. టీడీపీతో ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకొంటే సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి టీడీపీకి ఉంటుంది. త్యాగానికి తాము సిద్దమని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.