
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుల మరీ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించినా కొందరు మృగాళ్ళు మారడం లేదు. తాజాగి అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై 30ఏళ్ల యువకుడు అత్యాచారం జరపగా, శ్రీసత్యసాయి జిల్లాలో బి ఫార్మసి యువతి ప్రియుడి పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడే స్నేహితులతో కలిసి యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై తాజాగా హోమంత్రి తానేటి వనిత స్పందించారు.
అనకాపల్లి చిన్నారి ఘటన, శ్రీ సత్యసాయి జిల్లా తేజశ్విని సంఘటనలపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి తానేటి వనిత. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ల చిన్నారిని అర్ధరాత్రి ఎత్తుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని హోంమంత్రి ఆదేశించారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే ఆరు బృందాలను ఏర్పాటుచేసి నిందితుడికోసం గాలించామని... ఇప్పటికే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రికి అనకాపల్లి ఎస్పీ తెలిపారు. అతడి పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కోర్టులో అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హోంమంత్రికి వనితకు తెలిపారు.
తీవ్ర అస్వస్థతకు గురయిన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యసిబ్బందికి హోంమంత్రి సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హోమంత్రి వనిత హామీ ఇచ్చారు.
ఇక శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బి ఫార్మసి విద్యార్థిని తేజస్విని సంఘటనలో నిందితుడు సాదిక్ ను వెంటనే అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హోమంత్రికి తెలిపారు. తేజస్విని తల్లిదండ్రులు కోరడంతో రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హోంమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు.
అనకాపల్లి అత్యాచారం:
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 3వ వార్డులో బుద్ది సాయి(30) నివాసముంటున్నాయి. అతడి ఇంటిపక్కనే ఇద్దరు అక్కాచెల్లెల్లు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన సాయి అభం శుభం తెలియని ఈ చిన్నారులపై కన్నేసాడు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి 2 గంటల సమయలో బాలికలిద్దరూ బహిర్భూమికి వెళ్ళగా ఇదే అదునుగా రహస్యంగా వారిని అనుసరించిన సాయి దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరిలో చిన్నదైన ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన అతడు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
శ్రీ సత్యసాయి జిల్లాలో బి ఫార్మసి విద్యార్థిని అనుమానాస్పద మృతి...
శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన యువకుడి తోటలో యువతి తీవ్ర గాయాలతో మృతిచెందడం కలకలం రేపింది. అయితే యువతిది ఆత్మహత్య కాదని... గ్యాంగ్ రేప్ చేసి చంపారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ దారుణం గోరంట్లలో వెలుగుచూసింది.
గోరంట్లకు చెందిన యువతి తిరుపతిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఈమె గోర్లంట్లలో అద్దెకుండే ఇంటికి సమీపంలో సాదిక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసి యువతి తల్లిదండ్రులు ఇంటిని ఖాళీచేసి మరో చోట అద్దెకున్నారు. అయినప్పటికి యువతితో సాదిక్ ప్రేమాయణం కొనసాగుతూనే వుంది.
ఏమయ్యిందో తెలీదుగానీ తిరుపతిలో వుండాల్సిన యువతి ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ లో శవంగా తేలింది. శరీరంపై గాయాలతో ఓ షెడ్ లో ఉరేసుకుని యువతి మృతదేహం లభించింది. యువతిని తిరుపతినుండి తీసుకువచ్చి సాదిక్ తో పాటు అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి చనిపోయాక ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు యువతి మృతదేహంతో బాధిత కుటుంబం, మహిళా సంఘాల ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.