Bank fraud in Srikakulam Andhra Pradesh ఎంతో నమ్మకంతో కస్టమర్లు దాచుకున్న బంగారం బ్యాంకులోంచి మాయమైన ఘటన శ్రీకాకుళం జిల్లా గారలో వెలుగుచూసింది.
శ్రీకాకుళం : బ్యాంకులంటే ప్రజలకు ఎంతో నమ్మకం. సొంత భార్యాబిడ్డలు, కుటుంబసభ్యులకు డబ్బులు ఇవ్వడానికి వెనకాడేవారు కూడా బ్యాంకుల్లో డబ్బులు పెడుతుంటారు. కానీ కొందరు బ్యాంకు ఉద్యోగులవల్ల ప్రజల్లో బ్యాంకులపై నమ్మకం పోతోంది. ఖాతాదారుల సొమ్మును సొంత అవసరాలకు వాడుకుంటూ మోసం చేస్తున్నారు కొందరు బ్యాంక్ ఉద్యోగులు. ఇలాంటి ఘటనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది. ఒకటికాదు రెండుకాదు ఏకంగా నాలుగుకోట్ల విలువైన ఖాతాదారుల బంగారం బ్యాంకులో కనిపించకపోవడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా గార ఎస్బిఐ బ్యాంక్ లో బంగారం తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నారు కస్టమర్లు. అయితే ఈ బంగారం ఇప్పుడు కనిపించడంలేదు. ఇటీవల తన లోన్ డబ్బులు చెల్లించిన కస్టమర్ బంగారాన్ని తిరిగివ్వాలని బ్యాంక్ సిబ్బందిని కోరారు. కానీ బ్యాంకులో బంగారం లేకపోవడంతో అతడికి బంగారం ఇవ్వలేకపోయాడు. దీంతో బ్యాంకులో జరిగిన గోల్డ్ గోల్ మాల్ వ్యవహారం బయటపడింది.
తాము తాకట్టుపెట్టిన బంగారం బ్యాంకులో లేదని తెలిసి కస్టమర్లు గార ఎస్బిఐ బ్రాంచ్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇలా 60 మంది కస్టమర్లు బ్యాంకు తలుపులు మూసేసి ఆందోళనకు దిగారు. వెంటనే తమ బంగారం తిరిగి ఇవ్వాలని... అప్పటివరకు బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగనివ్వమని హెచ్చరించారు. దీంతో బ్యాంక్ ఉన్నతాధికారులు, పోలీసులు కస్టమర్లకు సర్దిచెబుతున్నారు.
Also Read బంగారం రూటే సెపరేటు.. పెళ్లిళ్ల సీజన్లో షాకిస్తున్న ధరలు.. సంక్రాంతికి రికార్డు స్థాయికి..
అయితే బ్యాంకులోని బంగారం మాయమవడం వెనక డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియతో పాటు మరో ఆరుగురు సిబ్బంది హస్తం వున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటపడటంతో ఆందోళనకు గురయిన స్వప్నప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయింది.
ఈ బంగారం మాయంతో సంబంధమున్న మరికొందరు ఉద్యోగులు బ్యాంకుకు రావడం లేదు. దీంతో బంగారం మాయం వెనకున్నది వారేనని అనుమానిస్తూ బ్యాంక్ మేనేజర్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే మేనేజర్ రాజు ఎస్బిఐ బ్యాంక్ ఉన్నతాధికారులకు కూడా ఖాతాదారుల తాకట్టు బంగారం మాయంపై సమాచారం అందించారు. వెంటనే గార బ్రాంచ్ కు చేరుకున్న అధికారులు ఆడిట్ చేపట్టారు. ఖాతాదారుల ఆందోళన చెందవద్దని... డిసెంబర్ 8 లోపు బంగారాన్ని చూపిస్తామని హామీ ఇస్తున్నారు.