Cyclone Michaung..నెల్లూరు-బాపట్ల మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్: భారీ వర్షాలు

By narsimha lodeFirst Published Dec 5, 2023, 9:51 AM IST
Highlights

మిచౌంగ్ తుఫాన్ ఇవాళ  11 గంటల సమయంలో  నెల్లూరు-బాపట్ల మధ్య తీరం దాటనుంది.  మిచౌంగ్  తుఫాన్ కారణంగా  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  

అమరావతి: మిచౌంగ్ తుఫాన్  మంగళవారంనాడు 11 గంటల సమయంలో   తీరాన్ని దాటనుంది.  మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో  ఇప్పటికే తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర మిచౌంగ్ తుఫాన్  తీరం దాటనుంది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా  తీరం వెంట  గంటకు 90 నుండి  110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో  చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో  రాయలసీమ, ఉత్తరాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా మంగళవారం నాడు తెల్లవారుజాము నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలుల కారణంగా  చెట్లు, విద్యుత్ స్థంభాలు  కుప్పకూలుతున్నాయి. దీంతో  విద్యుత్ ను నిలిపివేశారు.  చెన్నై-నెల్లూరు  మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి.తుఫాన్ ఎఫెక్ట్ తో  కోనసీమ జిల్లాల్లో  అధికార యంత్రాంగం అలర్టైంది.  భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ముంచెత్తింది.  దీంతో కోనసీమ జిల్లాల్లో  37 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ చేసింది.రెండు రోజుల క్రితం  అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ నెల  3వ తేదీన  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు  ఫోన్ చేశారు. మిచౌంగ్ తుఫాన్  నేపథ్యంలో  సహాయక చర్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందని  మోడీ హామీ ఇచ్చారు. 

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  నెల్లూరు ,తిరుపతి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

 


 

click me!