దేశానికి బాగుంది.. రాష్ట్రానికేముందీ? 31 మంది వైసీపీ ఎంపీలు ఏం సాధించారు?: కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు స్పందన

By Mahesh KFirst Published Feb 1, 2023, 8:21 PM IST
Highlights

కేంద్ర బడ్జెట్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి దోహదపడుతుందని, కానీ, ఏపీ రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో నిరుత్సాహం కలిగిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, 31 మంది వైసీపీ ఎంపీలు ఏం సాధించారని ప్రశ్నించారు.
 

అమరావతి: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు దేశ పురోగతికి తప్పక దోహదపడుతాయని వివరించారు. అదే సమయంలో కర్ణాటకకు రూ. 5,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం సాధించుకోలేకపోయిందని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు.

2014లో ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకడం సంతోషకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ బడ్జెట్ పెట్టుబడి వ్యయంపై ప్రధాన దృష్టి పెట్టడం మంచి విషయం అని పొగిడారు. 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాలను రూపొందించి.. ఆ దిశగా బడ్జెట్‌లో నిర్ణయాలు చేయడం హర్షించదగినదని  వివరించారు.

అలాగే, సాగు రంగానికి మంచి కేటాయింపులు జరిపారని, రైతన్నలకు ప్రోత్సాహకంగా రూ. 20 లక్షల కోట్ల సాగు రుణాలు కేటాయించడం, ఆవాస్ యోజన కింద రూ. 79 వేల కోట్లు కేటాయించడం సానుకూల నిర్ణయం అని వివరించారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రవాణా రంగంలో భారీ గా కేటాయింపులు చేయడం శుభ సూచకం అని ఆయన తెలిపారు. ఆదాయ పన్నుల్లో మార్పులు తెచ్చి వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలకు ఊరట ఇచ్చారని చెప్పారు.

Also Read: Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌తో ఎవరికి లాభాలు.. ఎవరికి లాస్?

కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహపరిచిందని అన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు ఆర్థిక సహాయాన్ని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారని ఆయన ప్రస్తావించారు. అయతే, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నదని, కానీ, వాటిని సాధించడంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 31 మంది వైసీపీ ఎంపీలు ఏం సాధించారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు, విభజన హామీలు, రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వం సాధించుకోలేకపోయిందని తెలిపారు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ అని పేర్కొన్నారు.

click me!