
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం తన కల అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి ఒక పథకం కూడా ఆయన తయారు చేయిస్తున్నారు. వచ్చే సిఆర్ డిఎ సమావేశానికల్లా ఈ పథకం సిద్ధం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వ్యాపారం అంటే ఏమిటి, పరిశ్రమలంటే ఏమిటని అవగాహన కల్పించేందుకు 123 మంది రాజధాని ప్రాంత రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ ప్రతిపాదనకు బుధవారం జరిగిన 12వ సీఆర్‌డీఏ ప్రాధికార సమావేశంలో ఆయన ఆమోద ముద్ర వేశారు.
‘రాజధాని గ్రామాలలో ఉన్న రైతులు అమరావతికి అసలు పౌరులు. అందుకే తొలుత వారిని సింగపూర్ పంపిస్తున్నా. సింగపూర్‌లో ఉన్న ఉత్తమ అభ్యాసాలు, అవకాశాలపై అవగాహన పెంచి వ్యాపార, వాణిజ్య రంగాల్లో వారిని ప్రావీణ్యులను చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశం,’ అని ఆయన చెప్పారు.
నిజానికి సింగపూర్ తీసుకువెళ్లేందుకు జరిపిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 123 మంది రైతులు అర్హత సంపాదించారు. లాటరీ తీసి అందులో వందమందిని ఎంపిక చేశారు. మిగిలిన ఆ 23 మంది రైతులను నిరుత్సాహ పర్చకుండా వారిని కూడా సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనతో మరో రూ. 12 లక్షల అదనపు బడ్జెట్ కేటాయించారు. ముఖ్యమంత్రి దానికి వెంటనే ఆమోదం తెలిపారు.
రాజధాని రైతులు వ్యవసాయం మానేసి వాణిజ్య, పారిశ్రామికరంగం వైపు మరలే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలని చెప్పారు.