Bail to Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత ఐదు నెలలుగా జైల్లో వుంటున్న కల్వకుంట్ల ఇంటి ఆడపడుచు కవితకు బెయిల్ లభించింది.  డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన ఆమెకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలునుండి కవిత విడుదలయ్యారు. 

అయితే బెయిల్ కోసం ఈడి, సిబిఐ కోర్టులచుట్టూ తిరిగినా కవితకు బెయిల్ లభించలేదు. ప్రతిసారి బెయిల్ పిటిషన్ దాఖలుచేయడం...కోర్టులు తిరస్కరించడం జరిగేది. ఇలా ఎంతలా ప్రయత్నించినా కవితకు బెయిల్ లభించలేదు. దీంతో దాదాపు 164 రోజులపాటు ఆమె జైలుజీవితం గడిపారు. దీంతో కవిత కుటుంబసభ్యులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.  

కవిత బెయిల్ వెనక మూడు కారణాలు : 

డిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన వారందరికీ తొందరగానే బెయిల్ వచ్చింది. డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కవిత తర్వాతే అరెస్టయినా బెయిల్ లభించింది. కానీ కవిత బెయిల్ కోసం ఐదు నెలలకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ,ఈడి తరపు లాయర్లు వాదించారు. కానీ కీలకమైన మూడు అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. 

డిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఎన్ఫోర్క్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ స్కాం లో కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్న కవితతో పాటు మిగతావారిని విచారించింది. ఇలా ఈడీ దర్యాప్తు పూర్తయ్యింది. కాబట్టి కవితను ఇంకా విచారించాల్సిన అవసరం లేదని భావించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

ఇక ఈ డిల్లీ లిక్కర్ స్కాంపై సిబిఐ దర్యాప్తు కూడా పూర్తయ్యింది. పూర్తి వివరాలతో కూడిన తుది చార్జ్ షీట్ ను కూడా సిబిఐ దాఖలుచేసింది. అంటే సిబిఐ కూడా కవిత నుండి ఇప్పటికే రాబట్టాల్సిన సమాచారం రాబట్టారు. ఇకపై ఆమెను విచారించి తెలుసుకోవాల్సిన అంశాలేవీ లేవని న్యాయస్థానం భావించింది. అందువల్లే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 

ఇక కవిత మహిళ కావడం... దాదాపు ఐదు నెలలుగా జైల్లో వుండటం కూడా బెయిల్ మంజూరుకు మరో కారణం. మానవతా కోణంలో ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినట్లు  తెలుస్తోంది.  

ఇలా మూడు అంశాలు కవిత బెయిల్ విషయంలో బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. రూ.10 లక్షల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించారు. అలాగే దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించిన న్యాయస్థానం పాస్ పోర్టును స్వాధీనం చేసుకుంది.