Kalyana Lakshmi : ఇంట్లో పెళ్లీడు ఆడపిల్ల వుందంటే ఆ కుటుంబానికి ఆర్థిక అవసరాలు వున్నట్లే. ఆడపిల్లకు కట్నకానుకలు పెట్టి ఘనంగా పెళ్లి చేయాలని పేరెంట్స్ కోరుకుంటారు. కానీ చాలామంది పేదరికం కారణంగా పెళ్లి ఖర్చులను భరించలేని పరిస్థితిలో వుంటారు... అలాంటివారు పెళ్లీడు ఆడపిల్లలను భారంగా భావిస్తుంటారు. అయితే ఆడపిల్లలు భారం అనే భావన తొలగించి వరంగా భావించే పరిస్థితి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకమే కల్యాణ లక్ష్మి. తాజాగా ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులకోసం ఎదురుచూస్తున్న అమ్మాయిల తల్లిదండ్రులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఆడపిల్ల పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకుండా ప్రభుత్వం కొంత ఆర్థికసాయం అందించేలా రూపొందించిన పథకం ఈ కల్యాణ లక్ష్మీ లేదా షాదీ ముబారక్. అమ్మాయి పెళ్లి తర్వాత తల్లిదండ్రులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని లక్ష రూపాయలు పొందవచ్చు. ఇలా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా కొనసాగిస్తోంది. బిఆర్ఎస్ కంటే ఓ అడుగు ముందుకేసి లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్ లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. 

తాజాగా తెలంగాణ కల్యాణ లక్ష్మి నిధులను విడుదల చేసింది. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లోంచి ఇప్ప టివరకు వచ్చిన దరఖాస్లుకు సరిపడా నిధులను విడుదలచేసారు. ఇలా  రూ.1225.43 కోట్లను రేవంత్ సర్కార్ విడుదలచేసింది. 

తెలంగాణలో ఇప్పటివరకు 65,026 కళ్యాణ లక్ష్మి పథకంకోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1, 2024 నుండి ఇప్పటివరకు  33,558 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇక గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అంటే మార్చి 31, 2023 వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో వున్నాయి.  ఇందులో 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి.

ఇక ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 28,225 దరఖాస్తులు ఎమ్మార్వోల వద్ద, మరో 12,555 దరఖాస్తులు ఆర్డివో ల వద్ద పెండింగ్ లో వున్నాయి. ఇలా పెండింగ్ దరఖాస్తులు పోగా మిగిలిన 24,038  దరఖాస్తుల కోసం రూ.240 కోట్లు అవసరం అవుతాయి. ఇక పెండింగ్ లో వున్న దరఖాస్తులతో కలుపుకుంటే మొత్తంగా రూ.650 కోట్ల వరకు అసవరం అవుతాయి. మిగిలిన నిధులను ఇకపై దరఖాస్తు చేసుకునేవారికోసం ఖర్చు చేయనున్నారు. 

కల్యాణ లక్ష్మి నిధుల విడుదలపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేసారు. బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయంగా రూ. 1,00,116 రూపాయలు అందించడం సంతోషంగా వుందన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా ఆడబిడ్డల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 1225.43 కోట్లు మంజూరు చేసామన్నారు. కల్యాణ్ లక్ష్మి నిధుల విడుదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.