ఈ ఏడాది జూన్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 123 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అత్యంత వేడిగాలులు భారత్‌లో విచాయి. అయితే, జూన్ నెల రైతులను నిరాశపర్చినా... జూలైలో రుతు పవనాలు మంచి చేయనున్నాయి.

గడిచిన జూన్‌ నెలలో 123 సంవత్సరాల అత్యంత వేడిని భారత్‌ భరించింది. అలాగే, అస్థిరమైన వర్షపాతం లోటును కూడా చవిచూసింది. అయితే, జూలై చల్లనికబురు తెచ్చింది. ఈ జూలైలో దేశమంతటా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఐఎండీ నివేదిక ప్రకారం.. ఈ నెలలో భారతదేశం మొత్తం మీద నెలవారీ వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA) కంటే 106శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఖరీఫ్ పంటలు, ముఖ్యంగా నీటి ఆవశ్యకత ఉన్న వరిలాంటి పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 

గడిచిన జూన్‌ నెలలో వర్షపాతం లోటు దాదాపు 32.6 శాతానికి చేరుకోగా.. వాతావరణం పొడిగా ఉంది. ముఖ్యంగా వాయువ్య భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో కాలిపోయింది. ఆ ప్రాంతంలో 123 సంవత్సరాల్లో అత్యంత వేడితో పాటు సగటు నెలవారీ ఉష్ణోగ్రత సాధారణం కంటే దాదాపు 1.65 డిగ్రీలు ఎక్కువగా రికార్డయింది. 

IMD అంచనా ప్రకారం జూలైలో తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఉత్తర భారతదేశంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, కాశ్మీర్, ఇంకా దిగువ రాష్ట్రాల్లో నదులకు వరద పోటెత్తే అవకాశం ఉంది. అలాగే, భారీ వర్షాలు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. 

ఇకపోతే, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు గోదావరి, మహానది పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

కాగా, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.