కుక్కను పెంచుకుంటే ఇన్ని లాభాలున్నాయా?
మన జీవన శైలి చాలా ఫాస్ట్ గా మారిపోతోంది. దీనివల్ల జనాలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి సమస్యల్లో చిత్తవైకల్యం ఒకటి. ఇది పెద్దవయసు వారికి వచ్చే సమస్య. ఓ తాజా అధ్యయనం ప్రకారం.. కుక్కను పెంచుకునే వారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కుక్కను చూడగానే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది చాలా మందికి. ఆఫీసుల నుంచి ఇంటికి రాగానే ఇష్టంగా పెంచుకున్న కుక్కలను చూస్తే ఒత్తిడి, అలసటలు మటుమాయం అవుతాయి. ప్రస్తుతకాలంలో పెంపుడు జంతువులు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమయ్యాయి. వీటిని కూడా మనుషులతో సమానంగా చూస్తుంటారు. వాటికి బర్త్ డేలు చేయడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియా, వార్తల్లోనూ చూస్తూనే ఉంటాం. పెంపుడు జంతువులు మనకు ప్రేమను పంచడమే కాదు మనల్ని ఎన్నో రోగాల నుంచి కూడా కాపాడుతాయని నిపుణఉలు చెబుతున్నారు. ఈ రోజుల్లో పని ఒత్తిడి పెరగడం వల్ల జనాలు ఎన్నో రకాల మానసిక సమస్యలకు బలవుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఎక్కువగా బాధపడుతున్న సమస్యల్లో చిత్తవైకల్యం ఒకటి. ఈ సమస్య నుంచి బయటపడటానికి జనాలు ఎంతో ప్రయత్నిస్తారు. కానీ కుక్కలు ఈ సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును మీ దగ్గర పెంపుడు జంతువులు ఉన్నట్టైతే.. కుక్కను పెంచుకోని వారితో పోలిస్తే పెంచుకున్న వారికి.. 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో చిత్తవైకల్యం ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుందని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టోక్యో మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెరోంటాలజీ జపనీస్ నగరంలోని 12,000 మంది నివాసితులలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అసలు పెంపుడు కుక్కల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఒత్తిడిని తగ్గిస్తుంది
మీకు పెంపుడు కుక్క ఉంటే.. వాటితో మాట్లాడటం వల్ల మీ ఒత్తిడి, యాంగ్జైటీ స్థాయిలు తగ్గిపోతాయి. కుక్కను ప్రేమగా హగ్ చేసుకోవడం వల్ల మనలో ఒత్తిడిని తగ్గించే హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. కాగా ఈ దీర్ఘకాలిక ఒత్తిడి చిత్తవైకల్యానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కుక్కలు ఒత్తిడిని తగ్గించి చిత్తవైకల్యం నుంచి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది.
ఎక్కువ శారీరక శ్రమ
పెంపుడు కుక్కలు చురుగ్గా ఉండటానికి డైలీ వాకింగ్, వ్యాయామాలు చాలా అవసరం. అయితే మీరు కూడా వీటితో పాటుగా శారీరక శ్రమ చేసినప్పుడు మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చిత్తవైకల్యంతో సంబంధం ఉన్న ప్రమాద కారకాలు కూడా తగ్గుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే అభిజ్ఞా రుగ్మత వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఫిక్స్ డ్ రొటీన్
కుక్కలతో నివసించడం వల్ల కూడా మీ దినచర్య క్రమబద్ధంగా, స్థిరంగా ఉంటుంది. ఈ కారణంగా మీ జీవనశైలి మారే అవకాశం ఉండదు. ఇది మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్థిరమైన దినచర్యను అనుసరించడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.
Image: Getty Images
సామాజిక పరస్పర చర్యను పెంచుతుంది
కుక్కలు సామాజిక జంతువులు. ఒంటరితనం భావాలను ఎదుర్కోవటానికి వాటి సహవాసం మీకు ఎంతగానో సహాయపడుతుంది. అభిజ్ఞా పనితీరును మెరుగుపర్చడానికి సామాజిక అనుసంధానం ముఖ్యం. అలాగే కుక్కలను పెంచుకోవడం వల్ల సామాజిక పరస్పర చర్య పెరుగుతుంది.