ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యేవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బిడ్డా తల్లీ ఇద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే బిడ్డా తల్లీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.
ప్రెగ్నెన్సీ ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో అందమైన, అద్భుతమైన సమయం. మొదటిసారి గర్భం దాల్చడం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. అయితే చాలా మంది గర్భందాల్చడంతో తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. ఏమౌతుందోనని టెన్షన్ పడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భం పెరుగుతున్న కొద్దీ .. మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే ఏదైనా ప్రమాదకరమైన సంకేతాలు కనిపించినా వాటిని తొందరగా గుర్తించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొదటి సారి గర్భాదాల్చిన వారు ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వికారం
undefined
గర్భందాల్చిన మొదటి త్రైమాసికంలో.. చాలా మంది ఆడవారికి వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. మార్నింగ్ సిక్ నెస్ కూడా ఉంటుంది. ఇవి ప్రెగ్నెన్సీలో సర్వసాధారణం. గర్భందాల్చిన మొదట్లో అయితే కొంతమందికి అలసట, బద్ధకం, ఎప్పుడూ నిద్ర రావడం వంటి సమస్యలు వస్తాయి. ప్రెగ్నెన్సీ హార్మోన్లు పెరగడమే దీనికి కారణం. ఫోలిక్ యాసిడ్ తో పాటుగా కొన్ని మందులతో ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. మందులను వాడినా వాంతులు అలాగే అయితే హాస్పటల్ కు తప్పకుండా వెళ్లాలి.
సమయానికి తినడం
గర్భిణులు సమయానికి తినాలి. అలాగే తరచుగా ద్రవాలను తాగాలి. అప్పుడే డీహైడ్రేషన్, బరువు తగ్గడం సమస్యలను తగ్గించుకోవచ్చు. గర్భిణులు ఇంటి భోజనాన్నే చేయాలి. గర్భం పెరుగుతున్న కొద్దీ మొదటి త్రైమాసికం తర్వాత వికారం, వాంతులు దాదాపుగా ఆగిపోతాయి. దీంతో ఆడవారు మంచి అనుభూతిని పొందుతారు. దీంతో వారి ఆకలి మెరుగుపడుతుంది.
ప్రయాణం
మొదటి త్రైమాసికంలో ట్రైన్, ద్విచక్ర వాహనాల ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు ఆఫీసుల్లో పనిచేస్తున్నట్టైతే.. పని ఒత్తిడి ఎక్కువైతే గర్భం ప్రమాదంలో పడుతుంది. అందుకే ఇలాంటి పనులను దూరంగా ఉండండి. ఒత్తిడి లేకుంటేనే ఆఫీసు పనులను చేయండి.
బరువు పెరగడం
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు చాలా పాస్ట్ గా బరువు పెరుగుతారు. ఎందుకంటే మీరు ఎంత తింటున్నారు? ఏం తింటున్నారో అస్సలు గమనించరు. అందులోనూ శారీరక శ్రమ ఉండదు. విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటారు. మీ శరీర బరువు ప్రెగ్నెన్సీలో నెలకు 1 కిలో బరువు పెరగడం ఆరోగ్యకరమైంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల త్వరగా బరువు పెరుగుతారు. దీనివల్ల మీకు గర్భధారణ సమయంలో మధుమేహం , అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సమతుల్య ఆహారం
మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో మీరు సమతుల్య ఆహారాన్నే తినాలి. చక్కెర, బియ్యం వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల కంటే కూరగాయలు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. అలాగే గుడ్లు, పాలు, సన్నని మాంసం, సీఫుడ్, కొవ్వులు వంటి ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, గింజ నూనెలు, మొలకెత్తిన గింజలు, పండ్లు, బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉప్పు ఎక్కువగా, జిడ్డుగా ఉండే ఆహారాలను తగ్గించండి.
మలబద్ధకం
ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్దకం సాధారణ సమస్య. పుష్కలంగా నీటిని, ఇతర హెల్తీ ద్రవాలను తాగితే గర్భధారణలో యూరినరీ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. బీట్ రూట్, క్యారెట్లు, అరటిపండ్లు, ఆపిల్, బెర్రీలు, కాయధాన్యాలను తింటే మలబద్దకం సమస్య తొందరగా తగ్గిపోతుంది.
కంటినిండా నిద్ర
ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలాగే పగటిపూట కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. రాత్రి వేళల్లో పనిచేయడం అంత మంచిది కాదు. ఎడమ చేతివైపు తిరిగి పడుకోవడం మంచిది. ఎందుకంటే ఇది తల్లి నుంచి శిశువుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
వ్యాయామం
గర్భిణులు ఫాస్ట్ ఫాస్ట్ గా నడవకూడదు. ధ్యానం, లోతైన శ్వాస, ప్రినేటల్ యోగా మీకు విశ్రాంతినివ్వడానికి సహాయపడతాయి. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేసే ప్రొఫెషనల్స్ కు చిన్న చిన్న విరామాలు తీసుకుని కొన్ని నిమిషాలు పాటు తిరగడం మంచిది. మృదువైన బూట్లు, వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. బరువును ఎత్తడం మానుకోవాలి. ఎక్కువగా వంగకూడదు.