మెంతుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. అలాగే ఈ గింజలు మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతులను ఉపయోగించి మనం ఎన్నో హెయిర్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
మెంతులు పోషకాలకు మంచి వనరు. ఇవి మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. మనం కొనే హెయిర్ ప్రొడక్ట్స్ లో కూడా మెంతులను చాలా వరకు ఉపయోగిస్తారు. అయితే ఇంట్లో తయారుచేసిన హెయిర్ ప్యాక్ లను ఉపయోగించి కూడా మీరు జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. అసలు మెంతులను మన జుట్టుకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టుకు మెంతుల ప్రయోజనాలు
మెంతుల్లో మన జుట్టు పెరిగేందుకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్ లు ఉంటాయి. ఇవి మన జుట్టును జుట్టును మూలాల నుంచి పోషిస్తాయి. అలాగే వీటిలో ఇనుము, పొటాషియంతో పాటుగా అవసరమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇశి జుట్టు రాలడాన్ని, జుట్టు తెల్లబడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
జుట్టు పెరగడానికి..
మెంతుల్లో నికోటిన్ ఆమ్లం, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను పునరుత్పత్తి చేయడానికి, జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయి. ఈ గింజల్లో ఉండే లెసిథిన్ జుట్టును సిల్కీగా చేస్తుంది. ఇది హెయిర్ షాఫ్ట్ ను తేమగా, బలోపేతం చేస్తుంది. అలాగే ఇది జుట్టు రాకుండా చూస్తూంది. కొత్త జుట్టు రావడానికి కూడా సహాయపడుతుంది.
చుండ్రు తగ్గడానికి..
చాలా మందికి చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ చుండ్రు వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది. అయితే మెంతులు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని మనం చుండ్రును పోగొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు.
మెరిసే జుట్టు
మెంతులు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తాయి. మెంతుల్లో ఉండే శ్లేష్మం సహజసిద్ధంగా జుట్టు మెరిసేలా చేస్తుంది. మృదువైన, మెరిసే జుట్టు కోసం మీరు మెంతులను తరచుగా ఉపయోగించొచ్చు. ఇందుకోసం మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్ లా చేసి తలకు, జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే కొబ్బరి లేదా ఆలివ్ నూనె వంటి మీరు వాడే నూనెలో మెంతులను వేసి ఈ గింజలు ఎరుపు రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ నూనెను వడకట్టి తలకు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది.