RTC Strike: సైదిరెడ్డి గెలుపు లోగుట్టు కేసీఆర్ కెరుక...

By telugu teamFirst Published Oct 25, 2019, 2:19 PM IST
Highlights

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయాన్ని కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపైకి గురి పెట్టారు. హుజూర్ నగర్ ఫలితాన్ని బట్టి ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్దతు లేదని, తమకే ప్రజలు జైకొడుతున్నారని చెప్పారు. కానీ, అసలు కథ ఇదీ...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు మాటల మాంత్రికుడు. వ్యూహరచనలో దిట్ట. ఎవరు ఏం మాట్లాడినా, ఏం చేసినా పట్టించుకోనట్లు ఉంటారు. ఏమీ మాట్లాడరు. కానీ, అవకాశం చూసుకునే తన మాటల పెట్టెను తెరుస్తారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం తర్వాత కేసీఆర్ చేసిన పని అదే.

హుజూర్ నగర్ విజయాన్ని ,సాకుగా తీసుకుని కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ యూనియన్ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను చేయదలుచుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. ఆర్టీసీని మూసేస్తున్న విషయాన్ని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇచ్చారు. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయానికి కారణాలేమిటో కేసీఆర్ కు తెలియదని కాదు, కానీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఆర్టీసీ సమ్మెకు ముడిపెట్టారు. తమకు ప్రజల ఆదరణ ఉందని, ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్దతు లేదని ఆయన చెప్పారు. కానీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పనిచేసిన అంశాలు ఏమిటనేది ఆకళింపు చేసుకుంటే, కేసీఆర్ వ్యూహంలోని ఆంతర్యం అర్థమవుతుంది. 

సైదిరెడ్డిపై సానుభూతి

సాధారణ ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ట్రక్ గుర్తు కారణంగా సైదిరెడ్డి ఓడిపోయారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పుడే చాలా వరకు ఎదురుగాలి ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత, గతంలో ఓడిపోవడం సైదిరెడ్డిపై పెరిగిన సానుభూతి హుజూర్ నగర్ ఫలితానికి గల కారణాల్లో ఒక్కటి.

పద్మావతిపై కోదాడ కేసు ప్రభావం

సాధారణ ఎన్నికల్లో పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఓటమి పాలయ్యారు. కోదాడలో చెల్లని నాణెం హుజూర్ నగర్ లో చెల్లుతుందా అని టీఆర్ఎస్ నేతలే ప్రశ్నించారు. మరో వైపు కోదాడ కేసు పద్మావతి అభ్యర్థిత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లను లెక్కించకుండానే టీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ గెలిచినట్లు ప్రకటించారని ఆరోపిస్తూ పద్మావతి కోర్టులో కేసు వేశారు. 

ఆ కేసులో పద్మావతికి అనుకూలంగా తీర్పు వస్తే ఆమె కోదాడకు తిరిగి వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకులే ప్రచారం చేసారు. అది నిజమే కదా, అని ఓటర్లు అనుకుని ఉంటారు. అది టీఆర్ఎస్ కు ఉప ఎన్నికలో కలిసి వచ్చింది. 

అధికార పార్టీ బలం...

రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీకి అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ ఉంది. ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనే విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. కాంగ్రెసు కేంద్రంలో అధికారంలో లేదని, అందువల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభ సభ్యుడిగా ఉన్నా ఒరిగేదేమీ ఉండదని, రాష్ట్రంలో కూడా కాంగ్రెసు అధికారంలో లేదు కాబట్టి పద్మావతిని గెలిపిస్తే హుజూర్ నగర్ కు చేకూరే ప్రయోజనం ఏమీ లేదని టీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లింది. 

టీఆర్ఎస్ ఇంకా నాలుగున్నరకు పైగా అధికారంలో ఉంటుంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి సహా టీఆర్ఎస్ నాయకులంతా చెబుతూ వచ్చారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసించారని చెప్పడంలో సందేహం లేదు.

పద్మావతి పనితీరు...

ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి నియోజకవర్గం కోసం చేసిన ప్రయత్నాలేవీ లేవని టీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం సమస్యలను ఏమేమి తీర్చలేదో చెబుతూ వచ్చారు. జిల్లా సమీక్ష సమావేశాలకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదని, అటువంటి స్థితిలో హుజూర్ నగర్ సమస్యలను ఆయన ఎక్కడ లేవనెత్తుతారు, ఎలా పరిష్కరిస్తారని జగదీష్ రెడ్డి చెబుతూ వచ్చారు 

ఇక పద్మావతి విషయానికి వస్తే కూడా అటువంటి విషయాన్నే టీఆర్ఎస్ ప్రజల్లోకి లోతుగా తీసుకుని వెళ్లింది. కోదాడ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి పద్మావతి ఏమీ చేయలేదని, అందుకే కోదాడ ప్రజలు ఆమెను ఓడించారని చెప్పారు. పద్మావతి శాసనసభలో ఒక్కసారి మాత్రమే మాట్లాడారని, అది కూడా కోదాడ సమస్యలపై కాకుండా రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడారని, అటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటే హుజూర్ నగర్ నియోజకవర్గానికి చేకూరే ప్రయోజనం ఏదీ ఉండదని టీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. 

స్థానిక బలిమి...

ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానికేతరుడనే విషయాన్ని సాధారణ ఎన్నికల్లోనే టీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లింది. స్థానికుడైన సైదిరెడ్డిని గెలిపిస్తే మన మధ్య ఉంటారనే ప్రచారాన్ని ఆయన అనుచరులు బలంగా తీసుకుని వెళ్లారు. యువత అంతా ఆయన వెంట నడిచిందని చెప్పాలి. ఫక్తు రాజకీయ నాయకుడిగా సైదిరెడ్డి కనిపించకపోవడం కూడా ఆయన బలమే.

సైదిరెడ్డి బంధువర్గం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయంగా విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాలు సైదిరెడ్డికి ఎక్కువగా కలిసి వచ్చాయి. ఎక్కడికక్కడ మద్దతును కూడగట్టుకోవడానికి అది పనికి వచ్చింది. 

ప్రజల్లోకి వెళ్లడం...

సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా సైదిరెడ్డి ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. గ్రామాలను చుట్టి వస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వచ్చారు. హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక ఖాయమని తెలిసిన మరుక్షణమే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తనను టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా ప్రకటించడానికి ముందే నియోజకవర్గంలో గట్టి పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండడానికి వీలైంది. పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెసు అధిష్టానం సహజంగానే చాలా ఆలస్యంగా ఖరారు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభకు గెలిచిన తర్వాత కూడా హుజూర్ నగర్ కు పెద్గగా రాలేదనే అభిప్రాయం కూడా ఉంది. 

ఆర్టీసీ సమ్మె ప్రభావం...

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రజల తీర్పు అన్ని సవాళ్లను ఎదుర్కుని అధికార పార్టీకి చెందిన స్థానిక యువకుడిని గెలిపించుకుంటే మంచిదనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. హుజూర్ నగర్ లో ఆర్టీసీ డిపో లేకపోవడం కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించపోడానికి కారణం. ఉద్యోగుల సమస్యలను వివరించడానికి ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ప్రయత్నాలను ఆదిలోనే టీఆర్ఎస్ తిప్పికొట్టింది. యూనియన్ల నాయకులు నియోజకవర్గంలోకి ప్రవేశించకుండా చూసుకుంది. 

సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్నకు ఎదురైన పరిస్థితి గురించి అందరికీ తెలుసు. పెద్ద యెత్తున నామినేషన్లు వేయడానికి ప్రయత్నించిన సర్పంచుల వ్యూహాన్ని ఆయనను పోలీసుుల అదుపులోకి తీసుకోవడం ద్వారా తిప్పికొట్టారు. అదే స్థితి తమకు ఎదురు కావచ్చుననే అభిప్రాయం యూనియన్ల నేతల్లో నాటుకుపోయింది. 

పైగా, హుజూర్ నగర్ లో ఉద్యోగుల ప్రభావం తక్కువగా ఉంటుంది. నీటి పారుదల సౌకర్యం దండిగా ఉండడంతో నియోజకవర్గంలోని అధిక శాతం పంటలు పండడం వల్ల రైతు సమస్యలు ఉండవు. నియోజకవర్గంలో దాదాపు 15 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఉన్నత విద్యలో ముందుకు వెళ్లకపోతే ఆ ఫ్యాక్టరీల్లో చేరే అవకాశం యువతకు ఉంది. అందువల్ల రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఆ నియోజకవర్గంలో లేవు. ఏమైనా హుజూర్ నగర్ పట్టణం అభివృద్ధి చెందలేదు, రోడ్లు బాగా లేవు వంటి సమస్యలు మాత్రమే ఉంటాయి. వాటి విషయంలో 20 ఏళ్ల పాటు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారనే ప్రచారం బాగా పనిచేసింది. 

జగదీష్ రెడ్డి, పల్లాలతో పాటు ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్ ను గెలిపించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలోనే వ్యూహరచన అమలు జరుగుతూ వచ్చాయి. మండలాలవారీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. హుజూర్ నగర్ గిరిజన తండాల్లోకి మంత్రి సత్యవతీ రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రయ నాయక్ లను దించారు. వారు ఇల్లిల్లూ చుట్టుముట్టారు. గ్రామాలనే కాదు, ఏ ఇంటినీ వదిలిపెట్టకుండా టీఆర్ఎస్ దళాలు ఎన్నికల్లో పనిచేశాయి. ఈ దళాల ముందు కాంగ్రెసు బలగాలు గానీ, నాయకుల ప్రసంగాలు గానీ గాలికి కొట్టుకుపోయాయి.

కేసీఆర్ వ్యూహం...

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయానికి ఆర్టీసీ సమ్మెతో ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని పై కారణాలతో స్పష్టంచేసుకోవచ్చు. అయితే, హుజూర్ నగర్ విజయాన్ని ఆసరా చేసుకుని కేసీఆర్ ఆర్టీసీ కార్మిక నేతలపై తన వాగ్బాణాలను సంధించారు. యూనియన్ నేతలను విమర్శిస్తూ కార్మికులకు బాసటగా నిలుస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. 

మొత్తం మీద, హుజూర్ నగర్ విజయం సందర్భాన్ని కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెను దెబ్బ కొట్టడానికి మాత్రమే కాకుండా ప్రజల్లోకి తన పట్ల సానుకూల సంకేతాలు పంపించడానికి వాడుకున్నారు. 

click me!