పొత్తు పొడుపు: ఇసుక సాక్షిగా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు దోస్తీ

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 5:04 PM IST
Highlights

ఇసుక కొరత సాక్షిగా జనసేన, టీడీపీల మధ్య పొత్తు పొడుస్తోందని ప్రచారం. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తప్ప వేరొకరు మద్దతుగా నిలిచే ప్రసక్తే లేదు. 
 

అమరావతి: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఇద్దరు మనుషుల మధ్య చిచ్చు పెడతానన్నది ఒక సామెత. ఆ సామెతను ఇసుకకు అన్వయిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలనుకుంటే ఏపీ రాజకీయాలను చూడాల్సిందే.  

ఇసుక ఇసుక నువ్వేమి చేస్తావంటే అధికార విపక్షాల మధ్య చిచ్చు పెట్టగలను, రాజకీయాలకు కేంద్రంగా ఉండగలను, అవసరమైతే పాత బంధాలను కూడా కలపగలను అని చెప్పిందట. ఇసుకేంటి మాట్లాడటం ఏంటి అనుకుంటున్నారా...?

గత వారం రోజులుగా ఏపీని కుదుపుకుదిపేస్తున్న ఇసుక అంశం మామూలుగా లేదు. ఈ ఇసుక కొరత అంశాన్నే టాపిక్ గా తీసుకుని విపక్షాలు లాభం పొందేందుకు ప్రయత్నిస్తే కొన్ని పార్టీలు పాత బంధుత్వానికి ప్రయత్నిస్తున్నాయి. 

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు. ఇసుక కొరత అనేది రాష్ట్ర సమస్య అని అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. 

2014లో ఏ పార్టీలకు అయితే పవన్ కళ్యాణ్ మద్దతు పలికారో ఆ పార్టీలకు ముందుగా ఫోన్ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులకు స్వయంగా ఫోన్ చేసి లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై ఉద్యమాన్ని మెుదలుపెట్టిందే బీజేపీ అని అలాంటిది తాము ఎందుకు జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని నిలదీసింది. జనసేనతో వేదిక పంచుకోలేమని తేల్చి చెప్పేసింది. 

ఇకపోతే మరో పాతమిత్రపార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం పవన్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నాయకులు పాల్గొంటారని స్పష్టం చేశారు. 

లాంగ్ మార్చ్ కు మద్దతుతోనే ఆగిపోలేదు....భవిష్యత్ లో ప్రభుత్వంపై పోరాటానికి జనసేన పార్టీ ఎలాంటి పోరాటానికి పిలుపు ఇచ్చినా తాను ఆహ్వానిస్తామని తమ పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుందని ప్రకటించేశారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలకడంతోపాటు భవిష్యత్ కార్యక్రమాలకు కూడా అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడంతో మళ్లీ జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు చిగురిస్తోందని ప్రచారం జరుగుతుంది. 

ఇసుక కొరత సాక్షిగా జనసేన, టీడీపీల మధ్య పొత్తు పొడుస్తోందని ప్రచారం. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తప్ప వేరొకరు మద్దతుగా నిలిచే ప్రసక్తే లేదు. 

ఏపీలో జగన్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాదని భావించిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నించారు. కేంద్రంతో విబేధించి తప్పుచేశామని ఒప్పుకున్నప్పటికీ బీజేపీ మాత్రం కరుణించడం లేదు. 

చంద్రబాబు నాయుడు కేసుల కోసం భయపడుతున్నాడని అందువల్ల బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారని బీజేపీ జాతీయ నేతలు విమర్శించారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికి ఏముందని టీడీపీ ఓడిపోయిన పార్టీ అంటూ సెటైర్లు వేసింది. 

అక్కడితో ఆగిపోలేదు. చంద్రబాబు నాయుడు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామంటే తాము సహకరిస్తామంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పొలిటికల్ సెటైర్లు వేశారు. పొత్తుకు అయితే డోర్లు క్లోజ్ అయిపోయాయని విలీనానికి అయితే తెరిచే ఉన్నాయన్నారు. 

ఇక బీజేపీ తెగేసి పొత్తు ఉండదని చెప్పడంతో చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ జనసేన. జనసేన పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు ఉండటంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసినా గౌరవప్రదమైన సీట్లన్నా దక్కించుకోవచ్చుననే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు టీడీపీ నేతలు. దాంతో వారంతా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీలోకి లేదా రాష్ట్రంలో ఉన్నా వైసీపీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకి ఒక సపోర్ట్ గా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుత లాంగ్ మార్చ్ కి భవిష్యత్ కార్యక్రమాలకు టీడీపీ మద్దతు ఉంటుందని ముందుగానే పొత్తుకు చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం

ఇసుక చుట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయాలు

పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం

click me!