ఆ మూడు వుంటేనే లోకేష్ అపాయింట్ మెంట్... చంద్రబాబు అయితే..: మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్

By Arun Kumar PFirst Published Mar 12, 2020, 10:04 PM IST
Highlights

ఇటీవలే టిడిపిని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన మాజీ  ఎమ్మెల్యే రహ్మాన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ లపై మరోసారి విరుచుకుపడ్డారు. 

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ పై ఇటీవలే టిడిపిని వీడి వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ చర్యల వల్ల టీడీపీ అయోమయ పరిస్ధితిలోకి వెళ్ళిపోయిందన్నారు. కార్యకర్తలు, నాయకులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితుల్లోకి వెళ్ళిపోయారని అన్నారు. తమలాంటి సామాన్యులకు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ అస్సలు దొరకదని, ఇక లోకేష్‌ అపాయింట్ మెంట్ కావాలంటే టై కట్టుకున్న ఎన్నారై అయినా అవ్వాలి లేదా డబ్బుండాలి లేదా పెద్ద పెద్ద కార్లలో దిగిన వారైనా వుండాలని అన్నారు. లేదంటే వీరిద్దరి అపాయింట్ మెంట్ లభించడం అసాధ్యమన్నారు. 

read more  ఎంపిటీసి అభ్యర్ధుల కిడ్నాప్...పోలీసుల సాయంతోనే: ఈసికి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

టీడీపీ నుంచి నిన్న బయటకు వచ్చిన పంచకర్ల రమేష్‌ మాటలను రేహ్మాన్ గుర్తుచేశారు. తండ్రీ కొడుకులు ఒకరోజు చెప్పిన మాట ఇంకోరోజు చెప్పరని... ముఖ్యంగా చంద్రబాబుది యూజ్‌ అండ్‌ త్రో పాలసీ  అని అన్నారు. చంద్రబాబుకు ఎవరైనా నాయకుడితో పని ఉంటే ఎంతో ప్రేమ ఒలకపోస్తారో పని అయిపోగానే టిష్యూ పేపర్‌లా బయటపారేస్తారని అన్నారు. ఇటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండాలా? ఇలాంటి వ్యక్తికి ఇంకా ప్రజలు సపోర్ట్‌ ఇవ్వాలా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సీఎం జగన్‌ అనేక కార్యక్రమాలు తీసుకురావడమే వాటిని సక్రమంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హమీలు మళ్ళీ ఎన్నికల సమయంలోనే దుమ్ము దులిపేవారు తప్ప మధ్యలో పట్టించుకొన్న పాపాన పోలేదన్నారు. ఎంతోమంది జీవితాలను రాజకీయంగా బలితీసుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

read more  వైసిపి శ్రేణులే అలా చేస్తే రాజీనామాకు సిద్దమా?: జగన్ కు కన్నా సవాల్

నలభై ఏళ్ళ ఇండస్ట్రీ కాదు  నాలుగురోజులైనా స్వచ్చమైన పాలన చేస్తూ  నిజాయితీగా  వుండాలంటూ చురకలు అంటించారు. ఇలాంటి  ఒక్క లక్షణమైనా చంద్రబాబుకు లేవని విమర్శించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల తర్వాత చంద్రబాబు కనుమరుగు ఖాయమన్నారు. ఇక లోకేష్‌ అయితే ట్విట్టర్‌లో తప్ప బయట కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.  ఇప్పటికే తెలుగుదేశం పార్టీ టైటానిక్‌ పడవలా మునిగిపోడానికి సిద్దంగా వుందన్నారు. ఇంట్లో కూర్చుని ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టుకో... అని లోకేష్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టారని సెటైర్లు విసిరారు. 

చంద్రబాబు ఇప్పటికైనా మనసుమార్చుకుని నడుచుకోవాలని.... అవాకులు చెవాకులతో బురదరాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. కాల్‌మనీ నాయకులని పక్కన పెట్టుకుని అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో టిడిపి చేతులెత్తేసిందని ప్రజలకు అర్ధమైందని... రాజకీయాలను స్వచ్చంగా నడిపించే జగన్‌ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బ్రహ్మండంగా గెలుస్తారని రెహ్మాన్ పేర్కొన్నారు. 

click me!