జగన్ మూడు రాజధానుల నిర్ణయం... బిజెపి ఎంపి టీజి కీలక వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Jan 6, 2020, 11:45 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంపై బిజెెపి ఎంపి టిజి వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

విశాఖపట్నం: రాయలసీమ,ఉత్తరాంధ్రాకు న్యాయం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా తాను పోరాటాలు చేస్తూనే ఉన్నానని... ఇన్నాళ్లకు అది నెరవేరిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని... దీనివల్ల తమ ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని నమ్ముతున్నట్లు తెలిపారు.  

విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటచేసిన మీట్ ది ప్రెస్ లో టిజి వెంకటేష్ మాట్లాడుతూ... హైకోర్టు బెంచులు రెండు, మూడు ఏర్పాటు చేసినప్పుడు మూడు సచివాలయాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. 

రాయలసీమలో కేవలం హైకోర్టు మాత్రమే కాదు మినీ సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల్లో కూడా అసెంబ్లీని నిర్వహించాలని సూచించారు. గతంలో రాయలసీమ ప్రాంతాన్ని నాయకులందరు బాగా వాడుకున్నారు కానీ అభివృద్దిపై దృష్టి పెట్టలేదన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని సూచించారు. 

పార్లమెంట్ స్టాండింగ్ కమిటి ద్వారా రాయలసీమ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులందరు ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేయాలని సూచించారు. 

click me!