రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఆయన ఎన్నికల కమీషనర్ మాదిరిగా కాకుండా టిడిపి నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం మరో మూడు రోజులు ఓపిక పడితే స్ధానిక సంస్ధలకు పాలకులు వచ్చేవారని... అప్పుడు మరింత పటిష్టంగా కరోనా వైరస్ నివారణ చర్యలు జరిగేవని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్దానిక ప్రజాప్రతినిధులు ఉంటే ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు పరిష్కారమయ్యేవని... పారిశుద్యం పనులు బాగా మెరుగయ్యేవన్నారు.
''చంద్రబాబు మీరు ఐదేళ్లు ఏం సాధించారు...ఇప్పుడు ఏం సాధిస్తారు. అలాగే బీజేపి వాళ్లు ఎన్నికలు ఎప్పుడు జరిగినా నిధులు మేం ఇప్పిస్తామని చెప్పండి. కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా అధికారంలో వున్నది. చంద్రబాబుకు వంత పాడటమే బీజేపీ నేతల పనిగా మారింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు స్ధానిక సంస్ధలకు వెళతాయి కానీ మా జేబుల్లోకి వస్తాయా. ఎన్నికలు ఆరు వారాలు కాదు ఆరు నెలల తర్వాత పెట్టండి... గెలుపు మాదే. ఈ విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు'' అని అన్నారు.
read more వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నిమ్మగడ్డకు ఆ పదవి...: అచ్చెన్నాయుడు
''కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడ్డుకున్నారన్న భాద మాకుంది. దీనిపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు ఈసీ నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖ ఈసీ రాసినట్లు లేదు, టీడీపీ నాయకుడు రాసినట్లుంది. రమేష్ ఇండియాలో టూరిజం ఎక్కువగా ఉండే గోవాలో కూడా 22న ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయా? సమాధానం చెప్పండి'' అని మంత్రి నిలదీశారు.
''ప్రతిపక్ష టీడీపీ చెప్పినట్లు నడుచుకోండి కానీ రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్న మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో సంప్రదించామన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ అధికారులు లేరా. కనీస సమాచారం మాకు ఇవ్వకుండా మీరు ఇంకా చంద్రబాబుని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా. రమేష్ ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి. ఈ రకంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయకుండా నష్టం చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో నమ్మకం విశ్వాసం సన్నగిల్లుతాయి'' అని అన్నారు.
''ఎన్నికలు వాయిదా అంటూ ఆరు వారాలు ఎన్నికల కోడ్ ఎలా సమర్ధించుకుంటారు. అంటే మీరు అధికారం చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారా. ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వానికి అవకాశమిస్తే ఆ ప్రభుత్వాన్ని మీరు గుర్తించరా. మేం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేయవద్దా'' అని ఈసీ రమేష్ ని ప్రశ్నించారు.
read more విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... చంద్రబాబుకు పరీక్షలు
''ఎన్నికలు వాయిదా అంటారు, అధికారులను బదిలీ చేయాలంటారు ఏంటిది. టీడీపీ వాళ్లు ఎన్నికలు రద్దుచేయాలంటున్నారు. విజయవాడ నాయకులకు మాచర్లలో పనేంటి. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడికి ఎందుకెళ్లారు. మీరు పోలీసులకు ముందుచెప్పి వెళితే సమస్యలు వచ్చేవా'' అని అన్నారు.
''చంద్రబాబుకు ప్రజలు బుద్దిచెప్పినా మీ ఆలోచన మారలేదు. కుటిల మనస్తత్వం మారలేదు. అడుగడుగునా అభివృద్దిని అడ్డుకుంటున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మా విజయాన్ని తాత్కాలికంగా అడ్డుకోగలరేమో కానీ శాశ్వతంగా కాదు. జగన్ ఉదయించే సూర్యుని లాంటి వ్యక్తి, మీరు ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకోలేరు. ప్రజలంతా ఈ కుట్రలు గమనించాలి, ఇప్పటికైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'' అని అన్నారు.