పిల్లిలా దాక్కుంటావెందుకు... మోదీని అడిగే దమ్ముందా కేసీఆర్ : వైఎస్ షర్మిల

Nov 11, 2022, 11:22 AM IST

పెద్దపల్లి : దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లిలా ఎందుకు దాక్కుంటున్నాడు? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రధాని వస్తున్నారంటే కేసీఆర్ ఎదురెళ్లి రాష్ట్రానికి కావాల్సిన వాటిగురించి అడగాలి... అలాకాకుండా ఆయనను కలవకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అడిగారు. నిరుద్యోగుల కోసం 2కోట్ల ఉద్యోగాల ఏమయ్యాయి... రాష్ట్రం కోసం విభజన హామీలు ఏమయ్యాయి.... రుణమాఫీ ఏమయ్యింది అని ప్రధానిని కలిసి అడగండి అని కేసీఆర్ కు షర్మిల సూచించారు. ఇంతకాలం మోదీతో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని చెట్లుపుట్టల వెంట డ్యూయెట్లు పాడుకున్నారు... ఇప్పుడేమో కలవడానికే ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్ర సమస్యలపై మోడీని ప్రశ్నించే దమ్ము లేదా? అని షర్మిల ప్రశ్నించారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయడం గురించి స్పందిస్తూ ఈ పరిశ్రమను ప్రారంభించాలని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడే ప్రయత్నించారన్నారు. ఆయన బ్రతికుంటే 13 సంవత్సరాల క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమై వుండేదని షర్మిల పేర్కొన్నారు.