దద్దమ్మ పాలమూరు ఎమ్మెల్యేలూ... దమ్ముంటే నా పాదయాత్ర ఆపండి: షర్మిల సవాల్

Sep 19, 2022, 1:16 PM IST

షాద్ నగర్ : తనపై నమోదయిన ఎఫ్ఐఆర్, అరెస్ట్ ప్రచారంపై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో వున్నవ్యక్తి మహిళను పట్టుకుని మరదలు అని అవమానకరంగా మాట్లాడినా కేసులుండవు... ఇదేంటని ప్రశ్నిస్తే తనపై కేసులు, ఎఫ్ఐఆర్ నమోదుచేసారని అన్నారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కట్టగట్టుకుని వెళ్లి అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసారన్నారు. ఇలా చేతకాని దద్దమ్మలైన పాలమూరు ఎమ్మెల్యేలు తన నా పాదయాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. తాను పాదయాత్ర కొనసాగిస్తే ఎక్కడ తమ బండారమంతా బయటపడుతుందోనని భయపడిపోతున్నారని షర్మిల పేర్కొన్నారు. . మీకు దమ్ముంటే పాదయాత్ర అపండి...  ఎలా ఆపుతారో నేనూ చూస్తాను... దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ షర్మిల సవాల్ విసిరారు.  జడ్చర్ల నియోజకవర్గంలో షర్మిల మహాప్రస్థాన పాదయాత్ర ముగిసి షాద్ నగర్ లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రామేశ్వరం వద్ద వైఎస్సార్ టిపి శ్రేణులు, మహిళలు షర్మిలకు బాజా బంజాత్రీలతో ఘన స్వాగతం పలికారు.