తెలుగు అకాడమీ దినసరి వేతన ఉద్యోగుల ధర్నా (వీడియో)

Jun 17, 2019, 6:10 PM IST

 హైదరాబాద్: పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరుతూ తెలుగు అకాడమీ దినసరి వేతన ఉద్యోగులు సోమవారం ధర్నా చేశారు. తెలుగు అకాడమీలో గత 20 ఏళ్లుగా దినసరి వేతనంపై పనిచేస్తున్న ఉద్యోగులకు 9 ఏళ్లుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు అనుగుణంగానే దినసరి వేతనాలను పెంచుతున్నారని వారు తెలిపారు. 

వేతనాలు పెంచతూ నిరుడు డిసెంబర్ 27వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను తెలుగు అకాడమీ యాజమాన్యం అమలు చేయడం లేదని, తమ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పెంచిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నాకు దిగారు. 

కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయాలని తాము ఈ ఏడాది మార్చి 26వ తేదీన తాము అకాడమీ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశామని, దానిపై స్పందన లేకపోవడంతో మరోసారి మే 25వ తేదీన కూడా డైరెక్టర్ ను కలిసి విన్నపం చేశామని వారు చెప్పారు. ఇంత చేసినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక ధర్నాకు దిగామని వారు చెప్పారు.