Oct 10, 2022, 10:53 AM IST
దుబాయ్ : ఏజెంట్ల మోసానికి బలైన తెలంగాణ యువకులు దేశంకాని దేశంలో చిక్కుకున్నారు. ఇటు ఇండియాకు రాలేక అటు విదేశంలో ఆకలితో అలమటిస్తూ విమానాశ్రయం బయట సాయంకోసం పడిగాపులు కాస్తున్నారు. ఇలా ఉద్యోగాల కోసం కొండంత ఆశతో దుబాయ్ వెళ్లిన సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన యువకులు ఇప్పుడక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. తమకు జరిగిన మోసాన్ని, ప్రస్తుత కష్టాలకు వివరించిన యువకుడు మంత్రి కేటీఆర్ సాయాన్ని కోరుతున్నారు.
సిరిసిల్లకు చెందిన నలుగురు యువకులు, నిజామాబాద్ కు చెందిన ఒకరు మొత్తం ఐదుగురు ఉద్యోగం కోసం ఏజెంట్ల ద్వారా దుబాయ్ కి వెళ్లారు. అయితే సదరు ఏజెంట్లు చెప్పినట్లు జీతం, పనివేళలు లేకపోవడంతో పనిచేస్తున్న కంపనీ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీసారు. దీంతో వీరంతా తాగి గొడవ చేస్తున్నారని సదరు కంపనీ పోలీస్ కేసు పెట్టింది. దీంతో యువకులంతా తిరిగి ఇండియాకు రావాలనుకుంటున్నా రాలేని పరిస్థితి ఏర్పడింది. వీరిపై కేసు వుండటంతో విమానాశ్రయ సిబ్బంది ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నారు. అటు ఉద్యోగం పోయి, ఇటు ఇండియాకు రాలేక గత మూడు రోజులుగా దుబాయ్ విమానాశ్రయం బయటే తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక యువకులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ప్రభుత్వమే తమ బిడ్డలను కాపాడాలని కోరుతున్నారు.