May 1, 2023, 5:42 PM IST
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి వెళుతున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు తనను అడ్డుకోవడంపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఆందోళన చేయడానికి సెక్రటేరియట్ కు వెళ్లడం లేదని... ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల అవకతవకలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నానని చెప్పారు. అవసరమైతే మీరు తన వెంటే వుండి సచివాలయంలోకి తీసుకెళ్ళాలని పోలీసులకు సూచించారు. తాను సచివాలయంలోకి వెళితే నష్టమేమిటని రేవంత్ ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు ముందుకు వెళ్ళనివ్వకపోవడంతో ఆగ్రహించిన రేవంత్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. కానీ పోలీసులు ఆయనను అక్కడినుండి తరలించారు.