ఆత్మహత్యలు నివారించడానికి గోదావరి నది వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి

Apr 15, 2023, 1:58 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు నివారించాలని సామాజిక కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. నిండు గోదావరి సూసైడ్ స్పాట్ గా మారడంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా అవసరాలు తీర్చే కాలేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండలా మారిన గోదావరి ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారడం విచారకరమన్నారు. వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు నివారించాలంటూ గతంలో పోరాటాలు చేసిన ఫలితం లేదన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిశ్రమలకు పుట్టినిల్లని యాజమాన్యాలు వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ నిర్మించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు, పరిశ్రమల యాజమాన్యాలు స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించాలని దినేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు