బ్రిటీష్ సైన్యానికి ఎదురు నిలిచి పోరాడిన మొద‌టి భార‌తీయ రాణి - రాణి వేలు నాచియార్’

Jul 31, 2022, 11:55 AM IST

బ్రిటీష్ ఆక్రమణదారులతో పోరాడుతూ ఎందరో ధైర్యవంతులైన భారతీయ మహిళలు తమ ప్రాణాలను అర్పించారు. ఇందులో ప్ర‌ముఖ‌మైన వారు ఝాన్సీ లక్ష్మీ బాయికి అని అంద‌రికీ తెలిసిందే. కానీ తమిళనాడుకు చెందిన ఇద్దరు ధైర్యవంతులైన మహిళలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారే రాణి వేలు నాచియార్, ఆమె మహిళా కమాండర్ కుయిలీ. తమిళ దేశంలో 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారిని కుదిపేసిన పాలిజర్ యుద్ధాల్లో ఈ మహిళలు ముఖ్య‌పాత్ర పోషించారు. 

బ్రిటిష్ వారితో పోరాడిన మొదటి భారతీయురాలిగా రాణి వేలు నాచియార్ నిలుస్తారు. రామనాథపురానికి చెందిన యువరాణి అయిన వేలు.. యుక్తవయస్సులోనే యుద్ధ కళలు, విలు విద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందింది. అంతే కాక ఆమె ఉర్దూ, ఆంగ్లం, ఫ్రెంచ్ తో సహా అనేక భాషలు కూడా నేర్చుకుంది. రాణి వేలు శివగంగ ధైర్యవంతుడైన రాకుమారుడు ముత్తు వదుగనాథ పెరియోద్య తేవర్ ను వివాహం చేసుకుంది. తెవార్ తన దేశాన్ని రక్షించుకుంటూ ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీతోనూ, దాని మిత్రుడైన ఆర్కాట్ నవాబుతోనూ పోరాడుతూ మరణించారు.

కలైయార్ కోయిల్ యుద్ధంలో తన భర్త మరణించిన తరువాత రాణి వేలు నాచియార్.. సాహసోపేతంగా తన కుమార్తె వెల్లాచితో కలిసి దిండిగల్ కు పారిపోయారు. ఆమె ఇలా చేయ‌డం బ్రిటిష్ వారి నుండి దాక్కోవడం మాత్రం కాదు. వారితో పోరాడేందుకు ఆమె మైసూరుకు చెందిన హైదర్ అలీతో ఒక వ్యూహాత్మక కూటమిని ఏర్పరచుకుంది. వారి స‌హ‌కారంతో ఈస్టిండియా కంపెనీ సైనిక కంటోన్మెంట్లపై వరుస ఆకస్మిక దాడులను నిర్వహించింది. 

ఈ దాడులలో అత్యంత క్రూరమైనవి 1780 విజయదశమి రోజున జ‌రిగిన‌వి. ఆ రోజున నాచియార్ త‌న శక్తివంతమైన మహిళా కమాండర్ కుయిల్ నేతృత్వంలో కొన‌సాగాయి. ఆమె అణగారిన కులానికి చెందినది. అయిన‌ప్ప‌టికీ ఆమె ధైర్యంగా పోరాడుతూ ఎవ్వ‌రూ చేయ‌లేని సాహ‌సానికి ఒడిగ‌ట్టింది. ఆమె తన శరీరమంతా నెయ్యి పోసుకుంటూ  ఆయుధ డిపోలోకి వెళ్లి.. మొత్తం ఆయుధాగారంతో పాటు తనను తాను తగలబెట్టుకుంది. భార‌త చ‌రిత్ర‌లో కుయిలీ మొదటి మానవ బాంబు కావచ్చు. ఈ అద్భుతమైన ఘటన ఆంగ్లేయులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వారు వెనుదిరిగారు. త‌రువాత నాచియార్ తన దేశమైన శివగంగను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బ్రిటీష్ వారి ఆక్ర‌మ‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడిన రాణి నాచియ‌ర్ వేలు, కుయిలిలు ధైర్య‌వంత‌మైన తమిళ మహిళల ప్రతిఘటనకు ప్రతీకగా నిలుస్తారు.