జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేసి చంద్రబాబు ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. ఈసారి కూడా అలానే చేస్తారన్నారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పథకం అమలులోనూ చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. యాభై ఏళ్లకే బీసీలు, మైనారిటీలకు ఇస్తానన్న పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.