Sep 19, 2022, 11:37 AM IST
అమరావతి : మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ''ఛలో అసెంబ్లీ'' పేరిట ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని ఎడ్లబళ్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే టిడిపి నాయకులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎడ్లబండిని బయటకు తెచ్చారు. ఎడ్లకు బదులు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండిని లాగుతూ నిరసన తెలిపారు.
ఎడ్లను అరెస్టు చేయటమేంటంటూ పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు, లోకేష్ కు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వయంగా లోకేష్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండిని మోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు వెళ్లారు.